టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics 2021)లో తాను సాధించిన కాంస్యం(bajrang punia bronze) కుటుంబ సభ్యులకు స్వర్ణంతో సమానమని భారత కుస్తీవీరుడు బజరంగ్ పునియా అంటున్నాడు. ప్లేఆఫ్ మ్యాచుకు ముందు తన మోకాలి గాయం గురించి తన తల్లి ఓం ప్యారీ భయపడిందని గుర్తు చేసుకున్నాడు. పతకం కన్నా ఎక్కువగా గాయం గురించి ఆలోచించిందని వెల్లడించాడు. టోక్యో నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన బజరంగ్ ఈటీవీ భారత్తో ముచ్చటించాడు. పలు విషయాలు తెలిపాడు.
"సెమీస్‌లో హజీ అలియెవ్ చేతిలో ఓటమి తర్వాత నా గదిలోకి వెళ్లి త్వరగా పడుకున్నా. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదు. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడా. రెజ్లింగ్ కన్నా ఎక్కువగా నా గాయం గురించే ఆమె భయపడుతున్నట్టు చెప్పింది. గెలుపోటములు ఆటలో భాగమంది. ముందు నా మోకాలిని రక్షించుకోవాలని సూచించింది. పతకం కన్నా నా ఆరోగ్యమే ముఖ్యమని అమ్మ చెప్పింది" అని బజరంగ్ అన్నాడు.
"పిల్లలు పతకాలు గెలవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. గాయపడ్డా గెలిచిన ఈ కాంస్యం తమకు బంగారంతో సమానమని నా కుటుంబ సభ్యులు అన్నారు. ఎందుకంటే గాయం వల్ల నేను రష్యాలో 20-25 రోజులు మ్యాటుకు దూరమైన సంగతి వారికి తెలుసు" అని బజరంగ్ వెల్లడించాడు.