టోక్యో ఒలింపిక్స్ ఆరో రోజు భారత బృందం నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్ చేతిలో పరాజయం పాలైంది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ కథ ముగిసింది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. బాక్సింగ్ 75కేజీల విభాగంలో పుజా రాణి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఒలింపిక్స్‌లో బుధవారం ఫలితాలు ఇవే..
హాకీలో పరాభవం..
- డిఫెండింగ్ ఛాంపియన్ గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు చెత్తగా ఓడింది. దీంతో వరుసగా మూడో ఓటమిని నమోదు చేసింది రాణీ రాంపాల్ సేన. ప్రత్యర్థి జట్టులో హన్నా మార్టిన్ (2వ, 19వ నిమిషం), లిలీ ఓస్లీ (41న నిమిషం), గ్రేస్ బాల్స్డాన్ (57వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. భారత్ తరఫున షర్మిలా దేవి (23వ నిమిషం) మాత్రమే గోల్ సాధించింది. నాకౌట్ స్టేజీకి క్వాలిఫై కావాలంటే వచ్చే రెండు మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాలి రాంపాల్ సేన. ఇప్పటికే మూడు మ్యాచ్‌లను ఓడిన భారత్‌కు ఇది కష్టమనే చెప్పాలి. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 1-5తో ఓడిన భారత్.. జర్మనీతో మ్యాచ్‌లో 0-2తో పరాజయం చవిచూసింది. ఇక తదుపరి మ్యాచ్ శుక్రవారం ఐర్లాండ్‌తో జరగనుంది.
ఆర్చరీ..
- ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో తరుణ్‌దీప్ రాయ్ తొలి రౌండ్లో విజయం సాధించాడు. ఉక్రెయిన్ ఆటగాడు ఓలెక్సీ హన్ బిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-4తో గెలుపొందాడు. అప్పటివరకు బాగానే ఆడిన తరుణ్‌దీప్ తదుపరి రౌండ్లో తేలిపోయాడు. ఇటలీకి చెందిన షన్నీ ఇటే చేతిలో 6-5తో ఓడిపోయాడు.
- మరో ఆటగాడు ప్రవీణ్ జాదవ్ కూడా అచ్చం ఇలాగే తొలి మ్యాచ్‌లో గెలిచి.. తదుపరి రౌండ్లో పరాజయం పాలయ్యాడు. దీంతో ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో ఈ ఇద్దరి కథ ముగిసింది.
- మహిళల వ్యక్తిగత విభాగంలో ఆర్చర్ దీపికా కుమారి ఫర్వాలేదనిపించింది. తొలుత భూటాన్ అథ్లెట్ కర్మాపై 6-0తో, తదుపరి రౌండ్లో అమెరికా ప్లేయర్ ఫెర్నాండెజ్‌పై 6-4తో గెలుపొందింది. ఫలితంగా ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్-8కు అర్హత సాధించింది.