టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ పసిడి కల నెరవేరలేదు. సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన కుస్తీ వీరుడిగా ఖ్యాతి గడించిన రవికుమార్ తుదిపోరులో మాత్రం పరాజయం చవిచూశాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, రష్యా రెజ్లర్ ఉగెవ్ జవుర్ 7-4 తేడాతో రవికుమార్‌పై విజయం సాధించాడు. ఈ ఓటమితో రవికుమార్ రజత పతకానికి పరిమితమయ్యాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 5కు చేరింది. అందులో రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలున్నాయి.
Olympics: భారత్‌కు మరో పతకం.. రెజ్లర్ రవి దహియాకు రజతం - Tokyo Olympics 2021 highlights
![Olympics: భారత్‌కు మరో పతకం.. రెజ్లర్ రవి దహియాకు రజతం Tokyo Olympics 2020: Ravi Kumar Dahiya lost in 57 Kgs Freestyle Wrestling Final](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12682717-thumbnail-3x2-ravi-dahiya.jpg)
16:36 August 05
నెరవేరని భారత్ పసిడి కల
2020, 2021 ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణపతకం నెగ్గిన రవి కుమార్ దహియా.. 2019 ప్రపంచ రెజ్లింగ్ టోర్నీలో కాంస్యాన్ని నెగ్గాడు. ఆ టోర్నీలో జావుర్ యుగేవ్ చేతిలోనే రవికుమార్ ఓటమి పాలయ్యాడు.
అలా ఫైనల్‌కు..
23 ఏళ్ల యువ రెజ్లర్ రవికుమార్ దహియా అద్భుతమే చేశాడు. అసమాన పోరాట తత్వాన్ని ప్రదర్శించిన రవి దహియా 57 కిలోల విభాగం సెమీఫైనల్లో ప్రత్యర్థి కజకిస్థాన్‌కు చెందిన నురిస్లామ్ సనయేవ్‌ను పిన్‌డౌన్‌చేసి విజేతగా నిలిచాడు. ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు నొక్కి పెడితే ఫాల్ ద్వారా విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. తొలి రౌండ్లో 13-2తో కొలంబియా రెజ్లర్ టిగ్రెరోస్ అర్బానోను, క్వార్టర్స్‌లో 14-4తో బల్గేరియాకు చెందిన వాలెంటినోవ్ వంగెలోవ్‌ను రవికుమార్ చిత్తు చేశాడు.