"ప్రపంచాన్ని మార్చే సామర్థ్యం క్రీడలకు ఉంది. స్ఫూర్తినిచ్చే శక్తి క్రీడలకు ఉంది. ప్రజలను ఒక్కటి చేసే సత్తా క్రీడలకు ఉంది. నిరాశతో కొట్టుమిట్టాడుతున్న జీవితాల్లో వెలుగు నింపే సత్తా క్రీడలకు ఉంది. అసమానతలు తొలగించేందుకు క్రీడలు ఉపయోగపడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పేదరికాన్ని జయించేందుకు, అభివృద్ధి సాధించేందుకు క్రీడలు ఓ ఆయుధంగా పనికొస్తాయి"
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దాతృత్వవేత్త నెల్సన్ మండేలా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌తో ఈ వ్యాఖ్యలు మరోమారు నిజమని రుజువైంది. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, నమ్మకంతో అహర్నిశలు శ్రమించి క్రీడల్లో సత్తా చాటి ఎందరో అథ్లెట్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవే క్రీడలు ఇప్పుడు వారి జీవితాలను మార్చేశాయి. పేదరికం నుంచి బయటపడొచ్చనే విశ్వాసాన్ని వారిలో నింపాయి.
'క్రీడా'శక్తి..
చదువు తప్ప మరేం చేసినా జీవితంలో ఓటమి తప్పదని ఎందరో తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరిస్తుంటారు. చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే చాలు జీవితంలో స్థిరపడిపోయినట్టే అనుకుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఆటలవైపు చూస్తే చాలు కన్నెర్ర చేస్తారు. చివాట్లు పెడుతుంటారు. ఇలా ఎందరో చిన్నారుల కలలను తల్లిదండ్రులు ప్రారంభ దశలోనే చిదిమేస్తారు.
ఇక పేదలైతే క్రీడలకే కాదు.. చదువుకు కూడా ఆమడ దూరంలో ఉంటారు. కూలీ పనితో జీవితం సాగిస్తూ, "రెండు పూటలా వేళ్లు నోట్లోకి వెళితే చాలు దేవుడా" అనుకుంటారు. కానీ అందరి జీవితాలను మార్చే సత్తా ఆటలకు ఉంది. 'కష్టపడితే.. విజయం వరిస్తుంది' అని నిరూపించారు అనేకమంది అథ్లెట్లు. వీరిలో ప్రస్తుత భారత మహిళల హాకీ జట్టు ఒకటి!
టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల చూపును తమవైపు తిప్పుకున్నారు మహిళల హాకీ జట్టు సభ్యులు. కనీసం కాంస్యం కూడా తీసుకురాలేకపోయినప్పటికీ, ఈ ఒలింపిక్స్‌లో మహిళలు చేసిన ప్రదర్శన విలువేంటో అందరికీ తెలుసు. హాకీకి దేశంలో పూర్వవైభవం వస్తుందనే నమ్మకం కలిగించారు. దీంతో ఇప్పుడు వీరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కానీ వీరి జీవితాల గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. వీరిలో చాలా మంది ఇంతకాలం పేదరికంతో అలమటించిన వారే! కొందరు దాదాపు గుడిసెల్లాంటి ఇళ్లల్లో ఉండేవారు. టీవీలు కాదు కదా.. కనీసం విద్యుత్ కనెక్షన్లు కూడా సరిగ్గా లేవు.