14 ఏళ్లలోపు పిల్లలు మహా అయితే ఇప్పుడు ఆన్‌లైన్ పాఠాలు వింటూ.. ఆ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. సరదాగా ఆటలాడుతూ.. అల్లరి చేస్తుంటారు. కానీ కొందరు పిల్లలు మాత్రం ఆటలను తీవ్రంగా తీసుకున్నారు. ఎంతలా అంటే.. ఒలింపిక్ పోడియంపై నిలబడేంతలా! అవును.. ఈ పిల్లలు ఇప్పుడు విశ్వ క్రీడల్లో పతకాలు సాధించిన పిడుగులు. ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు ప్రత్యేకంగా వయసు నిబంధన ఏమీ లేకపోవడం వీళ్లకు కలిసొచ్చింది.
ఇందులో మొదట చెప్పుకోవాల్సింది.. జపాన్ స్కేట్‌బోర్డర్ హిరాకి గురించే! 12 ఏళ్ల 343 రోజుల వయసులోనే ఆమె రజతం సొంతం చేసుకోవడం విశేషం. మహిళల పార్క్ స్కేట్‌బోర్డింగ్‌లో 59.04 స్కోరుతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఒలింపిక్స్ పతకం సాధించిన అతి పిన్న వయస్కురాలైన జపాన్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇదే విభాగంలో కాంస్యం గెలిచిన బ్రిటన్ స్కేట్‌బోర్డర్ స్కై బ్రౌన్ వయసు 13 ఏళ్లే. ఇప్పటికే వివిధ సంస్థల ప్రకటనకర్తగా ఉన్న ఈ చిన్నారికి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షలకు పైగా అనుచరులున్నారు. 2015లో స్కేట్‌బోర్డింగ్ దిగ్గజం టోనీ హాక్ సామాజిక మాధ్యమాల్లో తన వీడియో పంచుకోవడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మరో చిచ్చర పిడుగు.. రేసా లీల్. 13 ఏళ్ల 204 రోజుల వయసున్న ఈ బ్రెజిల్ బాలిక.. మహిళల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్‌లో రజతంతో అబ్బురపరచింది. స్కేట్‌బోర్డింగ్ స్ట్రీట్ విభాగంలో పసిడి దక్కించుకున్న మొమిజి నిషియా (జపాన్) వయసు కేవలం 13 ఏళ్ల 330 రోజులు మాత్రమే. తన అద్భుత ప్రదర్శన ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. టోక్యోలో స్వర్ణం పట్టేసిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.