తెలంగాణ

telangana

ETV Bharat / sports

Refugee Olympic Team : దేశ సరిహద్దులు దాటారు.. ఆటల్లో సత్తా చాటుతున్నారు

యుద్ధం, మతపరమైన ఆంక్షలు.. ఇలా ఎన్నో కారణాలతో ప్రాణాలు అరచేత పెట్టుకుని దేశ సరిహద్దులు దాటారు. పక్కదేశంలో తలదాచుకున్నారు. మనుగడే ప్రశ్నార్థకమైన చోట ఆటను ఆసరాగా చేసుకున్నారు. వారంతా శరణార్థి బృందంగా (రెఫ్యూజీ టీమ్‌(Refugee Olympic Team)) ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశమూ దక్కించుకున్నారు. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. కష్టాలను పక్కనపెట్టి చరిత్రలో తమకంటూ ఒక పేజీ లిఖించుకోవడానికి ప్రయత్నిస్తోన్న వారిలో కొందరి స్ఫూర్తి కథనాలివీ!

దేశ సరిహద్దులు దాటారు.. ఆటల్లో సత్తా చాటుతున్నారు
దేశ సరిహద్దులు దాటారు.. ఆటల్లో సత్తా చాటుతున్నారు

By

Published : Jul 26, 2021, 6:42 AM IST

వట్టి పాదాలతో పరుగెత్తి..

రోజ్‌ నాతికే లోకోన్యెన్‌ది దక్షిణ సూడాన్‌. పదిమంది పిల్లలున్న కుటుంబంలో ఈమే పెద్దది. సైనికులు వీళ్ల పొరుగువాళ్లను చంపుతుండటం చూసి వీళ్ల కుటుంబం పారిపోయి, కెన్యా చేరుకుంది. కాకుమా రెఫ్యూజీ క్యాంప్‌లో ఆశ్రయం పొందింది. అప్పటికి ఆమె వయసు తొమ్మిదేళ్లు. 2015లో ఒలింపిక్‌ బృందం ఈమె నివసిస్తున్న శిబిరంలో ట్రయల్స్‌ నిర్వహించింది. రోజ్‌ పదివేల మీటర్ల రేస్‌లో వట్టి పాదాలతో పరుగెత్తి గెలిచింది. అలా 2016 రియో ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవడమే కాకుండా శరణార్థుల బృందానికి ప్రాతినిధ్యం వహిస్తూ జెండానూ మోసింది. తమ జీవితాల్ని మార్చే ఏకైక మార్గం ఆటే అని నమ్మే రోజ్‌.. గతంలో పొందలేకపోయిన పతకాన్ని ఈ ఏడాది(Refugee Olympic Team) దక్కించుకోవాలనుకుంటోంది.

ఈ సారి అమ్మగా...

ఏంజెలినా నాదై లోహలిత్‌.. తొమ్మిదేళ్ల వయసులో దక్షిణ సూడాన్‌ నుంచి కెన్యా చేరుకుంది. యుద్ధం కారణంగా అక్కడ హింస పెరిగింది. దాన్నుంచి ఆమెను సురక్షితంగా ఉంచాలని తన తల్లిదండ్రులు పిన్నితో కలిపి దేశం దాటించేశారు. అలా చిన్న వయసులోనే కన్నవారికి దూరమైంది. కెన్యాకి వచ్చాక ఆటలపై దృష్టిపెట్టింది. రేసింగ్‌లో ఆమె ప్రతిభకు 2016 రియో ఒలింపిక్స్‌లో రెఫ్యూజీ టీమ్‌లో అవకాశమొచ్చింది. ఇప్పుడు మళ్లీ టోక్యో(Refugee Olympic Team)లో పాల్గొనే అవకాశమొచ్చింది. కాకపోతే ఈసారి అమ్మగా పాల్గొనబోతోంది. తన ఆట ద్వారా ప్రపంచానికి శాంతిని నెలకొల్పేలా చూడమని సందేశం ఇవ్వాలనుకుంటోందట.

జీవితాన్నిచ్చిన ఈతనే లక్ష్యంగా చేసుకుని...

యూశ్రా మార్దిని.. స్టార్‌ స్విమ్మర్‌. ఈమెకీ ఇది రెండో ఒలింపిక్స్‌. 2016లో మొదటిసారి పాల్గొంది. యూశ్రా చిన్నప్పటి నుంచే ఈతలో శిక్షణ తీసుకుంది. సిరియన్‌ ఒలింపిక్‌ బృందంలోనూ తను సభ్యురాలు. కానీ యుద్ధం సమయంలో సర్వస్వాన్నీ కోల్పోయింది. 17 ఏళ్ల వయసులో చెల్లెలితోపాటు యూరప్‌ పారిపోయింది. ఆరేడుగురు పట్టే దానిలో 20 మందితో గ్రీస్‌కు ప్రయాణమైందో పడవ. దానిలో యూశ్రా, ఆమె చెల్లీ ఉన్నారు. కానీ అది మధ్యలో ఆగిపోయింది. దీంతో వీళ్లిద్దరూ నీటిలోకి దూకేశారు. పడవను నెడుతూనే ఈదడం ప్రారంభించారు. వీళ్లని చూసి మరో ఇద్దరూ సాయమొచ్చారు. మూడున్నర గంటలు ఈది ఒడ్డుకు చేరుకున్నారు. అలా తమతోపాటు మిగతా వాళ్ల ప్రాణాలూ కాపాడారు. అక్కడి నుంచి చివరకు జర్మనీ చేరుకున్నారు. ఈ క్రమంలో ఏడు దేశాలు ప్రయాణించారు. ఈ సంఘటన తర్వాత యూశ్రా నీళ్లంటే భయపడింది. దాన్నుంచి బయటపడి నెమ్మదిగా సాధన మొదలుపెట్టింది. ‘ఒకప్పుడు ఈత సిరియా నుంచి జర్మనీ చేరుకునే క్రమంలో రక్షించింది, ఇప్పుడదే నా జీవితాన్ని తిరిగి నిర్మించుకునే అవకాశమిచ్చింది’ అంటోంది.

అణచివేత తట్టుకోలేక...

కిమియా అలిజాదే జోనౌజీకి ఇది మూడో ఒలింపిక్స్‌. తైక్వాండో క్రీడాకారిణి. గత రెండిట్లోనూ ఇరాన్‌ తరఫున పోటీపడింది. ఈసారి శరాణార్థిగా బరిలోకి దిగుతోంది. ఇరాన్‌లో అమ్మాయిల అణచివేతను తట్టుకోలేక స్వదేశాన్ని విడిచిపెడుతున్నట్లు గత జనవరిలో ప్రకటించింది. ఆమె వేసుకునే దుస్తుల నుంచి మాట్లాడే మాట వరకు ప్రతిదానిపై ఆంక్షలను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం జర్మనీలో నివసిస్తోంది.

దాడులు దాటుకుని...

సోమా అలీ జాదేది ఆప్ఘనిస్థాన్‌. పదేళ్ల వరకూ ఇరాన్‌లో పెరిగింది. తండ్రి నుంచి సరదాగా సైక్లింగ్‌ నేర్చుకుంది. తర్వాత వాళ్లు స్వదేశానికి వెళ్లిపోయారు. అక్కడ అమ్మాయిలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలన్నా ఎన్నో ఆంక్షలు. దీనికితోడు ఈమెది మైనారిటీ కుటుంబం. ఓరోజు స్పోర్ట్స్‌ దుస్తుల్లో సైకిల్‌ తొక్కుతోందని రాళ్లతో దాడిచేశారు. అయినా దొంగచాటుగా సాధన చేసేది. ఆటలో పేరు సాధించే కొద్దీ చంపేస్తామన్న బెదిరింపులు ఎక్కువయ్యాయి. బంధువుల నుంచీ ఒత్తిడి పెరిగింది. దీంతో వీళ్ల కుటుంబం 2017లో ఫ్రాన్స్‌లో ఆశ్రయం పొందింది. ఇక్కడ శిక్షణ తీసుకుంది. తన ఆట(Refugee Olympic Team) ద్వారా మానవత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాననే మసోమా తమ కలలను సాకారం చేసుకోలేకపోతున్న ఆడవాళ్లకు మార్గనిర్దేశం చేయాలనుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details