చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో గ్రేట్ బ్రిటన్‌పై భారత మహిళల హాకీ జట్టు 3-4 తేడాతోఓడిపోయింది. అయితే.. యావత్ దేశమంతా 'మహిళలు ఓడిపోయారు.. పతకం తీసుకురాలేదు' అని మాట్లాడుకోకుండా.. 'మహిళలు భలే ఆడారు. ఇదీ మ్యాచ్ అంటే..' అనుకుంటున్నారు. ఇందుకు కారణం వారి ప్రదర్శన. అంచనాలే లేకుండా బరిలో దిగి.. వావ్! అనిపించుకునే స్థాయికి ఎదిగారు. ఇందులో వారి కుటుంబసభ్యుల పాత్ర ఎంతో కీలకం. నిత్యం అమ్మాయిలకు అండగా ఉంటూ ప్రోత్సహించారు. ఇక కాంస్య పతక పోరులో జట్టు విజయాన్ని చూసేందుకు టీవీలకు అతుక్కుపోయారు. ఓటమి అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నారు.
టీవీల ముందే..
ఉదయం నుంచే భారత క్రీడాభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. వారిలో హాకీ మహిళల జట్టు సభ్యుల కుటుంబాలు కూడా ఉన్నాయి. తమ అమ్మాయిలు బాగా రాణించి, దేశానికి పతకాన్ని తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులు ఉదయం నుంచి టీవీల ముందే కూర్చుని మ్యాచ్‌ను వీక్షించారు. ప్రతి గోల్‌కు చప్పట్లతో అభినందించారు. పిల్లలు ఆనందంతో గంతులేశారు.
చివరి నిమిషం వరకు గెలుపు ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురైంది. మహిళల జట్టు 3-4తో ఓడిపోయింది. జట్టు కుటుంబసభ్యులు కూడా 'ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే' అని తమ అమ్మాయిలపై గర్వపడుతున్నారు.
"వాస్తవానికి ఇది ఓటమి కాదు. ఇక్కడి వరకు వచ్చినందుకు అమ్మాయిలను చూసి గర్వపడాల్సిన సమయం."
-గురు చరణ్ సింగ్, గుర్జిత్ సింగ్ సోదరుడు.
"ఇది ఓటమి కాదు. మహిళల పోరాటానికి ఇదొక గొప్ప విజయం. తిరిగొస్తున్న రాణికి ఘన స్వాగతం లభిస్తుంది. ఎందరో అమ్మాయిలకు ఈ మహిళా జట్టు స్ఫూర్తిగా నిలుస్తుంది."
-రాణి రాంపాల్ తండ్రి
"గెలుపోటములు ఆటలో భాగం. ముందుముందు జట్టు గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది."
-నేహా గోయల్ తల్లి.