టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా.. దేశానికి కనీసం మరో రజతాన్ని ఖాయం చేశాడు. ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 57 కిలోల విభాగం సెమీస్‌లో కజకిస్థాన్ రెజ్లర్ సనయేవ్ నురిస్లామ్‌పై నెగ్గి ఫైనల్‌లో ప్రవేశించాడు. తొలి అర్ధభాగంలో 2-1 పాయింట్ల తేడాతో దహియా ముందంజలో నిలిచాడు. రెండో అర్ధభాగంలో.. తొలుత సనయేవ్ 9 పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లగా, అద్భుతమైన పట్టుతో మూడు పాయింట్లు సాధించడం సహా చివరి నిమిషంలో ప్రత్యర్థి తప్పిదం కారణంగా దహియా విజయం సాధించాడు. తుదిపోరులో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రష్యాకు చెందిన జవూర్ ఉగువ్‌తో గురువారం మధ్యాహ్నం రవికుమార్ దహియా పోటీపడనున్నాడు.
Tokyo Olympics: రెజ్లింగ్‌లో ఫైనల్‌కు రవి దహియా - రెజ్లర్ రవికుమార్ దహియా
14:57 August 04
సనయేవ్‌పై విజయం
అంతకుముందు జరిగిన క్వార్టర్స్, ప్రీక్వార్టర్స్‌లోనూ రవికుమార్ ప్రత్యర్థులపై తిరుగు లేని ఆధిపత్యం ప్రదర్శించాడు. క్వార్టర్స్‌లో బల్గేరియా రెజ్లర్ వాంగెలోవ్‌తో తలపడ్డ దహియా 14-4 తేడాతో 16 సెకన్లు మిగిలి ఉండగానే టెక్నికల్ సుపీరియారిటీ కింద విజయం సాధించాడు. తొలి అర్ధభాగంలో బల్గేరియా రెజ్లర్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వని రవికుమార్.. 6-0 తేడాతో ముందంజలో నిలిచాడు. రెండో అర్ధభాగంలో వాంగెలోవ్‌కు తొలుత రెండు పాయింట్లు ఇచ్చిన దహియా.. ఆ తర్వాత తిరిగి పుంజుకొని ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. చివర్లో వాంగెలోవ్ మరో రెండు పాయింట్లు సాధించినప్పటికీ దహియా 14-4 తేడాతో ఆధిక్యంలో ఉండడం వల్ల 16 సెకన్లు మిగిలి ఉండగానే విజేతగా ప్రకటించారు.
సెమీస్‌లో దీపక్ ఓటమి
మరోవైపు 86 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ దీపక్ పూనియా సెమీస్‌లో ఓటమిపాలయ్యాడు. అమెరికా రెజ్లర్ డేవిడ్ మోరిస్ 10-0 తేడాతో దీపక్‌పై అలవోకగా నెగ్గాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్‌లో చైనా రెజ్లర్ లిన్ జుషెన్‌పై 6-3 తేడాతో, ప్రీ క్వార్టర్స్‌లో నైజీరియా రెజ్లర్ అజియోమోర్‌పై 12-1 తేడాతో టెక్నికల్ సుపీరియారిటీ కింద దీపక్ విజయం సాధించాడు. కాంస్య పతకం కోసం గురువారం జరగనున్న మ్యాచ్‌లో దీపక్ పునియా బరిలోకి దిగనున్నాడు.