చేతి కండను కొరికినందుకు కజకిస్థాన్ రెజ్లర్ సనయేవ్ క్షమాపణ చెప్పాడని టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవి దహియా చెప్పాడు. సెమీఫైనల్ బౌట్ ఆఖర్లో రవికి చిక్కిన సనయేవ్ వెల్లకిలా పడే క్రమంలో గట్టిగా కొరికేశాడు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అయింది.
రెజ్లర్ రవిని కొరికాడు.. క్షమాపణలు చెప్పాడు
ఒలింపిక్స్ సెమీఫైనల్లో రెజ్లర్ సనయేవ్.. రవి దహియాను గట్టిగా కొరికిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తాజాగా.. దీనిపై ఒలింపిక్స్ రజత పతక విజేత రవి స్పందించాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని.. ఘటన తర్వాత సనయేవ్ క్షమాపణలు చెప్పినట్టు తెలిపాడు.
"రెజ్లింగ్ అంటేనే దూకుడైన ఆట. ఇందులో రెజ్లర్లు ఒక్కోసారి బాహాబాహీకీ దిగుతుంటారు. ఇవన్నీ ఈ ఆటలో చాలా చిన్న విషయాలు. సెమీఫైనల్లో సనయేవ్ నా చేతి కండను కొరికిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయా. అతడిపై ఎలాంటి చెడు ఉద్దేశం పెట్టుకోలేదు. ఈ సంఘటన తర్వాత రోజు ఆటగాళ్ల బరువు తూచే దగ్గర సనయేవ్ ఎదురుపడ్డాడు. నా దగ్గరకు వచ్చి కరచాలనం చేసి పలకరించాడు. నేనూ అతడిని తిరిగి పలకరించాను. ఆ తర్వాత అతడు నన్ను కౌగిలించుకుని 'క్షమించు సోదరా' అని అన్నాడు. నేను నవ్వి అతడిని మళ్లీ కౌగిలించుకున్నా" అని రవి చెప్పాడు.
ఇదీ చూడండి:-స్వదేశానికి భారత బృందం.. అభిమానుల ఘనస్వాగతం