భారత ఒలింపిక్స్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కడం గర్వంగా ఉందని తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు తెలిపింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అంది. సెమీఫైనల్లో ఓడిన తర్వాత కోచ్ పార్క్ మాటలు స్ఫూర్తి నింపాయని వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన సింధుతో ఫోన్ ఇంటర్వ్యూ 'ఈనాడు'కు ప్రత్యేకం.
- వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించారు. భారత్ తరఫున సింధు అత్యుత్తమ ఒలింపిక్ క్రీడాకారిణి అని అనుకోవచ్చా?
నాకు మాటలు రావట్లేదు. రెండు పతకాల ఘనతను మాటల్లో వర్ణించలేను. మీ ప్రశంసకు కృతజ్ఞతలు. కచ్చితంగా గర్వించదగిన ఘనత ఇది. ఒలింపిక్స్‌లో దేశానికి ఒక పతకం అందిస్తే ఆ మధురానుభూతి జీవితాంతం నిలిచిపోతుంది. రెండు పతకాలు గెలవడం అన్నిటికంటే గొప్ప అనుకుంటున్నా. భారత ఒలింపిక్స్ చరిత్రలో నాకంటూ ప్రత్యేక స్థానం దక్కడం గర్వంగా.. సంతోషంగా ఉంది.
- రియోలో రజతం.. టోక్యోలో కాంస్యం గెలిచారు. 2024 పారిస్‌లో స్వర్ణం సాధిస్తారా?
పారిస్ ఒలింపిక్స్‌కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం టోక్యో పతకం మధురానుభూతుల్ని ఆస్వాదిస్తున్నా. పారిస్‌లో కచ్చితంగా బరిలో దిగుతా. స్వర్ణం కోసమే ప్రయత్నిస్తా. నా ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటా. అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తా.
- కాంస్య పతక పోరులో ఆఖరి పాయింటు సాధించగానే ఏం ఆలోచించారు?
చివరి పాయింట్ సాధించినప్పుడు అంతా శూన్యంగా అనిపించింది. ఏం చేస్తున్నానో తెలియలేదు. ఎలాంటి ఆలోచనలు రాలేదు. అయిదారు క్షణాల తర్వాత తేరుకున్నా. అవును.. నేను సాధించాను అనుకుని గట్టిగా అరిచా. కోచ్ పార్క్‌ను హత్తుకుని గెలుపు సంబరాలు మొదలుపెట్టా. కరోనా-లాక్డౌన్ కారణంగా చాలామంది ఎన్నో కష్టాలు పడ్డారు. వారందరితో పాటు నా కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ పతకం అంకితం. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఎవరూ స్టేడియానికి రాలేకపోయారు. వారందరికీ దూరంగా ఉండటం బాధగా అనిపించింది. ప్రతి ఒక్కరు వారి ప్రేమాభిమానాలు చూపించారు. అందరికీ కృతజ్ఞతలు.
- సెమీస్‌లో ఓడిన తర్వాత కాంస్య పోరుకు ఎలా సిద్ధమయ్యారు?
ఫైనల్ చేరుకోకపోవడం తీవ్రంగా బాధించింది. కన్నీళ్లు పెట్టుకున్నా. మంచి అవకాశం చేజారినందుకు చాలాసేపు బాధలో ఉన్నా. అప్పుడు కోచ్, ఫిజియో నాలో స్ఫూర్తి నింపారు. సెమీస్‌తోనే అంతా అయిపోయినట్లు కాదని.. తర్వాతి మ్యాచ్‌కు సిద్ధం కావాలని సూచించారు. కాంస్యానికి, నాలుగో స్థానానికి చాలా తేడా ఉంటుందని.. పతకం ఏదైనా పతకమే అని పార్క్ అన్నారు. ఆ మాటలు నాకు ప్రేరణ ఇచ్చాయి. ఆదివారం ఉదయం నిద్ర లేచాక కాంస్య పతకంపైనే దృష్టిసారించా. పార్క్ చెప్పిన మాటలు పదే పదే గుర్తొచ్చాయి. మ్యాచ్‌కు ముందు.. మధ్యలో అవే మాటలు మదిలో మెదిలాయి.
- రియో నుంచి టోక్యో వరకు సాగిన మీ ప్రయాణంపై ఏమంటారు?
అయిదేళ్లలో ఎత్తుపల్లాలు చూశా. రియో ఒలింపిక్స్ తర్వాత అన్నీ మారిపోయాయి. అనుభవం వచ్చింది. ఆటలో నైపుణ్యం పెరిగింది. కొత్త టెక్నిక్‌లు నేర్చుకున్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచా. కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయా. ఆట, టెక్నిక్ పరంగా చాలా మెరుగయ్యా. మధ్యలో కరోనా వచ్చింది. చాలా టోర్నీలు రద్దయ్యాయి. ఒలింపిక్స్‌కు ముందు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. అయినా ఒక్క రోజు కూడా శిక్షణకు దూరం కాలేదు. లాక్డౌన్ సమయాన్ని కొత్త టెక్నిక్‌లు నేర్చుకోడానికి, ఫిట్నెస్ మెరుగు పరుచుకోడానికి ఉపయోగించుకున్నాం. ఒలింపిక్స్‌లో పెద్ద పెద్ద స్టేడియాలు ఉంటాయి. ఏసీ ఉంటుంది. అలాంటి వాతావరణానికి అలవాటు పడేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాధన చేశాం. సుచిత్ర అకాడమీ నుంచి క్రీడాకారులు వచ్చారు. వారితో కలిసి సాధన చేశా. భారత బ్యాడ్మింటన్ సంఘం, సాయ్, తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ అడిగిన వెంటనే సహకారం అందించాయి. ఎప్పుడు ఏం కావాలన్నా సమకూర్చారు. ఎక్కడా ఇబ్బంది ఎదురుకాలేదు.
- రియో, టోక్యోల మధ్య తేడా ఉందా?