ఒలింపిక్స్ హాకీ సెమీఫైనల్లో బెల్జియం చేతిలో ఓడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమతో మాట్లాడడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని భారత కెప్టెన్ మన్‌ప్రీత్‌సింగ్ చెప్పాడు. ఆ స్ఫూర్తితో కాంస్య పతక పోరులో జర్మనీపై గెలిచామని అతనన్నాడు.
"బెల్జియం చేతిలో సెమీఫైనల్లో ఓడిన తర్వాత మేమంతా చాలా నిరాశలో కూరుకుపోయాం. ఈ సమయంలో ప్రధానమంత్రి మాతో మాట్లాడనున్నారని కోచ్ మాతో చెప్పాడు. 'మీరంతా చాలా బాగా ఆడారు. నిరుత్సాహపడొద్దు. కాంస్య పతక పోరులో సత్తా చాటి దేశాన్ని గర్వించేలా చేయండి' అని ఆయన మాతో అన్నారు. ఈ మాటలు జట్టుకు ఎంతో శక్తినిచ్చాయి. వట్టి చేతులతో భారత్‌కు వెళితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని అనుకున్నాం. 60 నిమిషాల్లో అందరం 100 శాతం ఆడితే మళ్లీ మా ముఖాల్లో నవ్వులు వస్తాయని భావించాం."
- మన్‌ప్రీత్ సింగ్, భారత పురుషుల హకీ టీమ్ కెప్టెన్
ఈసారి తాము భిన్నమైన ఆలోచనా ద్పక్పథంతో బరిలో దిగి సత్ఫలితాలు సాధించినట్లు మన్‌ప్రీత్ తెలిపాడు. "పతకం గెలవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. కెరీర్‌లో ఒలింపిక్స్ ఆడడం నాకిది మూడోసారి. కెప్టెన్‌గా తొలిసారి. 2012 క్రీడల్లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయాం. కానీ ఆ తర్వాత ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి మెరుగుపడ్డాం. 2016 క్రీడల్లో బాగానే ఆడినా క్వార్టర్‌ఫైనల్ దాటలేకపోయాం. కానీ ఈసారి భిన్నమైన ఆలోచనా దృక్పథంతో బరిలో దిగాం. ఈ క్రీడల కోసం ఎంతో శ్రమించాం. కరోనా సమయంలో చాలారోజులు బెంగళూరు సాయ్ కేంద్రంలో గడిపాం. పూర్తి స్థాయిలో రాణిస్తే పతకం గెలవొచ్చని ప్రతి ఒక్కరూ నమ్మాం. జట్టులో సీనియర్లు.. కుర్రాళ్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఎంతో కష్టపడ్డాం. చివరికి ఆ శ్రమే సత్ఫలితాన్ని ఇచ్చింది" అని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత పురుషులు హాకీ జట్టు.. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విశ్వక్రీడల్లో పతకాన్ని సాధించింది.
ఇదీ చూడండి..'15 నెలలుగా పడ్డ కష్టానికి ఫలితమే ఈ కాంస్యం'