ఒలింపిక్స్ ముగిసిన రెండ్రోజుల తర్వాత (ఆగస్టు 10న) విశ్వక్రీడలకు సంబంధించి ఓ ఫుట్బాల్ మ్యాచ్ను ప్రసారం చేసింది ఉత్తర కొరియా టీవీ ఛానెల్. ఈ విషయాన్ని ఆ దేశ స్థానిక మీడియా నివేదికలు వెల్లడించాయి. జులై 21న యూకే, చిలీ మధ్య జరిగిన మహిళల ఫుట్బాల్ మ్యాచ్ను 70 నిమిషాల పాటు కొరియన్ సెంట్రల్ టెలివిజన్ (కేసీటీవీ) ప్రసారం చేసింది. ఈ వీడియో ఎలా వచ్చిందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, ఆ వీడియో క్వాలిటీతో పాటు కామెంట్రీ కూడా సరిగా లేదని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో పాటు చైనా, బ్రెజిల్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ప్రసారమైనట్లు తెలుస్తోంది. కానీ, ఇందుకు సంబంధించి ఆధారాలేమి లేవు.
ఉత్తర కొరియాలో ఇలాంటి పొరపాట్లు జరగడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఒలింపిక్స్, ఇతర ఆటలకు సంబంధించి మ్యాచ్లు చాలా ఆలస్యంగా ప్రసారమయ్యేవి. నిర్ణీత సమయానికి కాకుండా వారాలు, సంవత్సరాలు ఆలస్యమైన సందర్భాలున్నాయి. 2016 రియో ఒలింపిక్స్ ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత ఆ దేశంలో మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం జరిగింది.