తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: ఒలింపిక్స్‌కు ఇక 'వేగ'మొస్తుంది! - టోక్యో ఒలింపిక్స్‌ ఉసేన్ బోల్ట్ వారసుడెవరు?

ఒలింపిక్స్‌కు అసలైన ఊపొచ్చేది ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ పోటీలతోటే. ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా అందరి దృష్టినీ ఆకర్షించేది ఈ పోటీలే. అవి మొదలవగానే విశ్వక్రీడలు వేగమందుకుంటాయి. ట్రాక్‌ మీద అథ్లెట్‌ మెరుపు వేగంతో దూసుకెళ్లినా.. పోల్‌ పట్టుకుని పైకెగిరినా.. ఎగిరి ముందుకు దూకినా.. గుండు విసిరినా.. బల్లెం వేసినా.. కనువిందే. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ను వేడెక్కించడానికి పాత యోధులకు తోడు కొత్త తారలూ సిద్ధం. గత మూడు పర్యాయాలు ఒలింపిక్స్‌కు వన్నె తెచ్చిన బోల్ట్‌ తరహాలో ఈసారి మెరుపులు మెరిపించే అథ్లెట్‌ ఎవరవుతారా అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

olympics
ఇక ఒలింపిక్స్‌కు వేగమొస్తుంది

By

Published : Jul 30, 2021, 6:44 AM IST

ఒలింపిక్స్‌కు అసలైన ఆకర్షణ అయిన ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ పోటీలకు రంగం సిద్ధమైంది. ఇందులో ప్రతి ఈవెంటూ ఆసక్తికరమే కానీ.. అథ్లెట్లు మెరుపు వేగంతో దూసుకెళ్లే పరుగు పందేలకు ఉండే ఆకర్షణే వేరు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవుడెవడో తేల్చే 100 మీటర్ల పరుగు పట్ల ఉండే ఆసక్తి ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మూడు పర్యాయాలు ఈ పోటీలో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బోల్ట్‌ కథ రియోలోనే ముగిసిపోయింది. అతడి వారసుడెవరన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. స్వయంగా బోల్టే 100 మీటర్ల పరుగులో విజేత కాగలడని అంచనా వేసిన బ్రోమెల్‌.. ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి మరి. ఈ అమెరికా యోధుడికి సవాలు విసరడానికి ఆండ్రి డిగ్రాస్‌ (కెనడా), యొహాన్‌ బ్లేక్‌ (జమైకా), రోనీ బేకర్‌ (యుఎస్‌) తదితరులు సిద్ధంగా ఉన్నారు.

మహిళా అథ్లెట్

మహిళల వంద మీటర్లలో ఫేవరెట్‌ అయిన 'షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌' ఒలింపిక్స్‌కే ప్రత్యేక ఆకర్షణ అనడంలో సందేహం లేదు. 2008, 2012 ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించి, గత ఒలింపిక్స్‌లో కాంస్యానికి పరిమితమైన ఈ జమైకన్‌.. మళ్లీ తన పతక రంగును పసుపులోకి మార్చాలనుకుంటోంది. ఆమె 200 మీ, 4×100 మీటర్ల రిలే పరుగుల్లోనూ పోటీ పడుతోంది. మహిళా అథ్లెట్లలో మరో ఆకర్షణీయ అథ్లెట్‌.. 'చికెన్‌ లెగ్స్‌'గా పేరున్న అలిసెన్‌ ఫెలిక్స్‌. ఆమె పదో ఒలింపిక్‌ పతకం, ఏడో స్వర్ణం లక్ష్యంగా టోక్యోలో అడుగు పెట్టింది. 35 ఏళ్ల వయసొచ్చినా, బిడ్డకు తల్లయినా ఆమెలో తపన తగ్గలేదు. 400 మీ. వ్యక్తిగత ఈవెంట్‌తో పాటు రిలేలోనూ ఈ అమెరికా దిగ్గజం బరిలోకి దిగుతోంది. 400 మీటర్ల హర్డిల్స్‌లో పురుషులు, మహిళల విభాగాలు రెండింట్లోనూ చూడదగ్గ అథ్లెట్లు ఉన్నారు. గత నెలలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన వార్‌హోమ్‌ (నార్వే)కు సవాలు విసరడానికి రాయ్‌ బెంజమిన్‌ (అమెరికా) సిద్ధంగా ఉన్నాడు.

మహిళా అథ్లెట్

మహిళల్లో అమెరికా మేటి అథ్లెట్లు మెక్‌లాలిన్‌, డల్లా మహ్మద్‌ల పోరూ రసవత్తరమే. పోల్‌వాల్ట్‌లో రష్యా తార ఇసిన్‌బయేవా తర్వాత అంతగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న క్రీడాకారుడు మొండో డుప్లాంటిస్‌. అమెరికాలో పుట్టి స్వీడన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. స్వర్ణానికి హాట్‌ ఫేవరెట్టే. ఇక సుదూర పరుగులో అందరి కళ్లూ సిఫాన్‌ హసన్‌ మీదే నిలవనున్నాయి. మహిళల 10000 మీ, 5000 మీ, 1500 మీ టైటిళ్లతో ‘ట్రిపుల్‌’ సాధించాలనే లక్ష్యంతో ఆమె బరిలోకి దిగుతోంది. పురుషుల 10000 మీ.లో దిగ్గజ అథ్లెట్‌ మో ఫరా అర్హత సాధించని నేపథ్యంలో కొత్త ఛాంపియన్‌ ఎవరవుతారో చూడాలి.

మన ఆశ అతడే..

అథ్లెట్​ల పరుగు

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు అవకాశాలు తక్కువే. మన ఆశలన్నీ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ మీదే ఉన్నాయి. అతను మాత్రమే పతకం గెలవగలడన్న అంచనా ఉంది. తన అత్యుత్తమ ప్రదర్శన (88.07 మీ)ను కాస్త మెరుగుపరచడంతో పాటు అదృష్టం కలిసొస్తే అతను పతకం గెలవడానికి అవకాశముంది. ద్యుతి చంద్‌ (100 మీ.), లలిత బాబర్‌ (3 వేల మీ. స్టీపుల్‌ చేజ్‌), తజిందర్‌ సింగ్‌ (షాట్‌పుట్‌), కమల్‌ప్రీత్‌ కౌర్‌ (డిస్కస్‌ త్రో), శివ్‌పాల్‌ సింగ్‌ (జావెలిన్‌ త్రో), అవినాష్‌ సాబ్లె (3 వేల మీ. స్టీపుల్‌ చేజ్‌), శ్రీశంకర్‌ (లాంగ్‌ జంప్‌)లపై అంచనాలు తక్కువే. అత్యున్నత వేదికపై వీళ్లెలాంటి ప్రదర్శన చేస్తారో?

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో కీలక ఈవెంట్లు(భారత కాలమానం ప్రకారం)

  • మహిళల 100 మీ. ఫైనల్‌ జులై 31 సాయంత్రం 6.20
  • పురుషుల 100 మీ. ఫైనల్‌ ఆగస్టు 1 సాయంత్రం 6.20
  • పురుషుల 400 మీ. హర్డిల్స్‌ ఆగస్టు 3 ఉదయం 8.50
  • మహిళల 200 మీ. ఫైనల్‌ ఆగస్టు 3 సాయంత్రం 6.20
  • పురుషుల 200 మీ. ఫైనల్‌ ఆగస్టు 4 సాయంత్రం 6.25
  • మహిళల 4×100 మీ. రిలే ఫైనల్‌ ఆగస్టు 6 రాత్రి 7.00
  • పురుషుల 4×100 మీ. రిలే ఫైనల్‌ ఆగస్టు 6 రాత్రి 7.20

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details