ఒక్క ఒలింపిక్ స్వర్ణంతో వంద కోట్లమంది హృదయాలకు చేరువయ్యాడు జావెలిన్ ఆటగాడు నీరజ్ చోప్డా. అతడి విజయం భారతీయ క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. దీనికోసం అలుపెరగని ప్రయత్నం చేసిన ఈ యువకెరటంలోని ఆటగాణ్నీ, సామాన్యుణ్నీ ఓసారి పలకరిద్దామా!
అందరి ప్రోత్సాహం...
నాన్న సతీశ్ కుమార్. అమ్మ సరోజ్ బాల. పానిపట్ దగ్గర్లోని ఖాంద్రా మా సొంతూరు. బరువు ఎక్కువగా ఉన్నానని చిన్నపుడు బాబాయి భీమ్‌సేన్ నన్ను జిమ్‌లో చేర్పించారు. అక్కణ్నుంచి స్నేహితులతో గ్రౌండ్‌లో అడుగుపెట్టి జావెలిన్ పట్టుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో 17 మంది ఉంటారు. వ్యవసాయమే ఆధారం. అలాంటి పరిస్థితుల్లోనూ నాకు పోషకాహారం అందించడానికి అదనంగా ఖర్చుచేశారు. అయితే ఆ అనుభవాలే లక్ష్యం మీద మరింతగా దృష్టిపెట్టేలా స్ఫూర్తినిచ్చేవి. కొన్నేళ్లుగా ఇంటికి ఏడాదిలో ఒకట్రెండు సార్లే వెళ్తున్నా. ఇంట్లో ఉన్నన్ని రోజులూ పండగ రోజులే. ఈసారి ఒలింపిక్ పతకంతో రాఖీ సంబరాలు ముందే మొదలయ్యాయి.
పోటీలోనే బెస్ట్...
జావెలిన్ క్రీడాకారుడికి బలంతో పాటు ఫ్లెక్సిబిలిటీ, వేగం ఉండాలి. ఈటె విసిరినపుడు భుజాన్నీ, మోచేయినీ ఎక్కువగా ఉపయోగిస్తాను. నా వ్యాయామాలు వీటి దృఢత్వాన్ని పెంచేలా ఉంటాయి. కొన్నిసార్లు గాయాలూ అవుతాయి. ప్రాక్టీసు ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాలి. వీటితోపాటు రన్నింగ్, జంప్స్, బరువులు ఎత్తడం చేస్తా. యోగా ధ్యానం కూడా చేస్తాను. శిక్షణ సమయంలోనే పోటీకి అన్ని విధాలా సిద్ధమవుతా. పోటీ అనేసరికి ఇంకా ఉత్సాహం వస్తుంది. చాలాసార్లు నా బెస్ట్ పోటీల్లోనే నమోదవుతుంది.
జులపాలు ఇష్టం...
జట్టు పెద్దగా పెంచుకోవడం ఇష్టం. ఐరోపా దేశాల్లో చల్లని వాతావరణం ఉంటుంది. అక్కడే ఎక్కువగా ప్రాక్టీసు చేస్తా, టోర్నీలకు వెళ్తా కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ వేడి ఎక్కువగా ఉండే దేశాల్లో చెమటలు పట్టి చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే ఒలింపిక్స్ సమయంలో జుట్టు కత్తిరించుకున్నా. ఆటగాడిగా ఉన్నంతసేపే జుట్టు పెంచుకుంటా. డ్యూటీమీద యూనిఫామ్ వేసుకుంటే మాత్రం ఆర్మీ కట్ చేసుకుంటా.
షాపింగ్ చేస్తా
చిన్నపుడు బాస్కెట్ బాల్ ఆడుతూ కింద పడ్డాను మణికట్టు దగ్గర దెబ్బ తగిలింది. 40 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ 20 రోజులకే ఆటలాడటం మొదలుపెట్టా. కానీ ఇప్పుడలా చేయలేను. కొన్నిసార్లు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గాయం తిరగబెడితే ఇంకా ప్రమాదం. ఆ సమయంలో చిన్నచిన్న వ్యాయామాలు చేస్తా. షాపింగ్‌కు వెళ్లి టైమ్‌పాస్ చేస్తా. కానీ ఇకమీదట అది వీలుపడదనుకుంటా. బైకుమీద షికార్లు చేయడమూ ఇష్టం.