తెలంగాణ

telangana

By

Published : Aug 4, 2021, 5:06 PM IST

Updated : Aug 4, 2021, 5:27 PM IST

ETV Bharat / sports

Tokyo Olympics: హాకీ సెమీస్​లో భారత మహిళా జట్టు ఓటమి

OLYMPICS:INDIA VS ARGENTINA WOMEN MATCH
హాకీ సెమీస్​లో భారత మహిళా జట్టు ఓటమి

16:46 August 04

ఫైనల్​లో అడుగుపెట్టిన అర్జెంటీనా

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు చేజార్చుకుంది. సెమీఫైనల్​లో భారత అమ్మాయిలు ప్రపంచ నంబర్‌వన్‌ టీమ్​ అర్జెంటీనాపై పోరాడి ఓడారు. కీలకమైన సెమీస్‌లో రాణి రాంపాల్‌ సేన 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి నిమిషం వరకు విజయం కోసం ప్రయత్నించినా.. ప్రత్యర్థి జట్టు తమ అనుభవంతో ఆ ప్రయత్నాలను అడ్డుకొంది. భారత్‌ నుంచి గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ చేయగా అర్జెంటీనాలో మరియా నోయెల్‌ 2 గోల్స్‌ చేసింది. ఇక కాంస్యం కోసం జరగనున్న పోరులో గ్రేట్​ బ్రిటన్​తో భారత మహిళల హాకీ జట్టు తలపడనుంది. 

మొదటి గోల్‌ మనదే

ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే టీమ్‌ఇండియా గోల్‌ చేసింది. పెనాల్టీ కార్నర్‌ను గుర్జిత్‌ కౌర్‌ సద్వినియోగం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. బంతిని తమ అధీనంలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాయి. దాంతో తొలి క్వార్టర్‌ను 1-0తో ముగించింది రాంపాల్‌ సేన. ఈ క్రమంలో టీమ్‌ఇండియా చేసిన కొన్ని పొరపాట్లు అర్జెంటీనాకు కలిసొచ్చాయి. 18వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను ప్రత్యర్థి సారథి మరియా నోయెల్‌ గోల్‌గా మలిచింది. దాంతో 1-1తో రెండో క్వార్టర్‌ ముగిసింది.

అర్జెంటీనా కెప్టెన్‌ అద్భుతం

మూడో క్వార్టర్లో రాణి జట్టు గోల్‌ చేసేందుకు విపరీతంగా శ్రమించింది. అయితే అర్జెంటీనా భారత గోల్‌ పోస్ట్‌పై దాడులు చేసి ఒత్తిడి పెంచింది. పదేపదే వృత్తం వద్దకు చేరుకోవడంతో 36వ నిమిషంలో వారికి పెనాల్టీ కార్నర్‌ లభించింది. మరియా ప్రమాదకరంగా ఆడుతూ దానిని గోల్‌గా మలిచింది. గోల్‌కీపర్‌ సవిత దానిని అడ్డుకోలేక పోయింది. 2-1తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లడంతో భారత్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఆఖరి క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు రాణి సేన ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా అయ్యాయి. ఎట్టకేలకు ఒక పీసీ భారత్‌కు వచ్చినా ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ దానిని మరియా బెలెన్ దానిని అడ్డుకుంది. ఆట అర నిమిషంలో ముగుస్తుందనగా వచ్చిన ఫ్రీహిట్‌ను గోల్‌ చేసేందుకు టీమ్‌ఇండియా ప్రయత్నిస్తే మళ్లీ బెనెల్‌ కిందపడి మరీ ఆపేయడంతో భారత్‌ ఆశలు అడియాసలు అయ్యాయి.

అర్జెంటీనా ఆరు పెనాల్టీ కార్నర్లలో 2 గోల్స్‌ చేయగా భారత్‌కు వచ్చిన 3 పీసీల్లో రెండింటిని ప్రత్యర్థి విజయవంతంగా అడ్డుకొంది. పురుషుల జట్టు సైతం బెల్జియంకు విపరీతమైన పీసీలు ఇవ్వడం గమనార్హం.

Last Updated : Aug 4, 2021, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details