కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలంటూ సొంత దేశ ప్రజల నుంచే వ్యతిరేకత. ఓ వైపు కొవిడ్ కేసులు పెరుగుదల, మరోవైపు పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించడం.. ఇలా ఎన్ని ప్రతికూలతలు వచ్చినా తట్టుకొని నిలబడింది జపాన్ ప్రభుత్వం. ఐపీఎల్, పీఎస్ఎల్ వంటి క్రికెట్ లీగ్‌లు కరోనాకు ప్రభావితమైనప్పటికీ.. ఇంత పెద్ద ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఆదివారంతో(ఆగస్టు 8) విశ్వక్రీడలు దిగ్విజయంగా ముగిశాయి.
రోజుకు 5 వేల కేసులొచ్చినా..
ఒలింపిక్స్-2020కి వేదికైన జపాన్‌లోని టోక్యో నగరంలో రోజుకు సగటున 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 5న అత్యధికంగా 5,042 కేసులు రావడం గమనార్హం. అయితే ఇందులో టోక్యోలోని ఒలింపిక్ గ్రామం అందుకు మినహాయింపు. ఎందుకంటే ఆ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విశ్వక్రీడల ఆరంభంలో కొన్ని కరోనా కేసులు వచ్చినా.. క్రమేపి నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తల వల్లే ఈ క్రీడలు నిర్విరామంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అవాంతరాలు రాకుండా క్రీడలను నిర్వహించడంలో జపాన్ ప్రభుత్వం విజయం సాధించింది.
ఎమర్జెన్సీ విధించి..
ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు.. అంటే జులై మధ్యలో టోక్యో నగరమంతా ఎమర్జెన్సీ విధించింది జపాన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పౌరులెవరూ బయటకు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. అయితే క్రీడల ఆరంభంలో అక్కడికి చేరుకున్న విదేశీ క్రీడాకారుల సహా కొంతమంది అధికారులు వైరస్ బారిన పడినా.. ఆ తర్వాత అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ విశ్వక్రీడలను సునాయాసంగా నిర్వహించింది.
ప్రేక్షకులను నో ఎంట్రీ..
టోక్యో ఒలింపిక్స్ నిర్విరామంగా కొనసాగేందుకు వీలుగా.. ఒలింపిక్ గ్రామంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం సహా స్టేడియాల్లోకి ఇతరులతో పాటు ప్రేక్షకులను అనుమతించలేదు.
ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్రామానికి టోక్యో నగరానికి ఎలాంటి సంబంధం లేదనే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. క్రీడాకారులు వినియోగించిన వస్తువులను, ప్రదేశాలను తరచుగా శానిటైజ్ చేశారు. ఇలా అనేక ప్రత్యేక జాగ్రత్తలు వహించి.. వైరస్‌ను ఒలింపిక్ గ్రామంలోకి రాకుండా చేశారు. విశ్వక్రీడలను దిగ్విజయంగా ముగించారు.