ఎదురుగా ఒక పెద్ద కొండ.. కింద ఓ కప్పల గుంపు.. అందులో ఒక్కొక్కటిగా ఆ కొండని ఎక్కే ప్రయత్నం చేస్తున్నాయ్! కానీ చాలా కప్పలు మధ్యలోనే ఆపేసి కింద పడిపోతున్నాయ్. కొన్ని ఇంకాస్త పైకెక్కి వెనుదిరుగుతున్నాయి. కానీ ఒక కప్ప మాత్రం కష్టపడి కొండను ఎక్కేసింది. ఎలా సాధ్యమైందా అని చూస్తే.. ఆ కప్పకు చెవులు పని చేయవట! అంత పెద్ద కొండను ఎక్కడం చాలా కష్టమంటూ చుట్టూ ఉన్న కప్పలు నిరుత్సాహ పరుస్తుంటే.. మిగతా కప్పలు జావగారిపోయి మధ్యలోనే ప్రయత్నాన్ని ఆపేస్తున్నాయట. కానీ ఆ చెవిటి కప్పకు ఆ మాటలేవీ వినిపించకపోవడం వల్ల కొండను ఎక్కేసిందట!
ఇది పుస్తకాల్లో చదువుకునే నీతి కథ. ఇలాంటిదే ఇప్పుడొక నిజ జీవిత కథ చెప్పుకుందాం..
ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో పతకం అంటే భారత క్రీడాకారులకు పైకెక్కలేని ఒక పెద్ద కొండలాంటిదే. శతాబ్దం కిందట్నుంచి అథ్లెట్లు పోటీ పడుతునే ఉన్నారు. ఎవ్వరూ లక్ష్యాన్ని చేరుకున్నది లేదు. 1960లో మిల్కా.. 1984లో ఉష.. 2004లో అంజూ లక్ష్యానికి కొంచెం చేరువగా వెళ్లినా నిరాశ తప్పలేదు. కానీ ఇప్పుడొచ్చాడు ఒకడు. పైన చెప్పుకొన్న కప్పలా అతనేమీ చెవిటివాడు కాదు. ఒలింపిక్స్ అంటే ఆషామాషీ కాదని.. అథ్లెటిక్స్‌లో పతకం అంత తేలిక కాదని.. ప్రత్యర్థులు అలా ఇలా ఉండరని.. ఈ వ్యాఖ్యలన్నీ విన్నాడు. అయినా తన సామర్థ్యాన్ని నమ్మాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం చేజిక్కించుకుని అబ్బుర పరిచాడు.
రియోలోనే ఖాయమైంది!
అవును.. నీరజ్ ఒలింపిక్ పతకం రియో ఒలింపిక్స్‌లోనే ఖరారైపోయింది! 2016 ఒలింపిక్స్‌కే వెళ్లని వాడికి పతకం ఖరారవ్వడమేంటి అనిపిస్తోందా? ఇదే చిత్రం. 2015-16 మధ్య రియో అర్హత టోర్నీలు జరుగుతున్నప్పటికి నీరజ్ వయసు 17 ఏళ్లే. అప్పుడే ప్రపంచ స్థాయిని అందుకుంటున్న అతను రియో బెర్తు సాధించలేకపోయాడు. కానీ రియోలో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలోనే అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్.. 86.48 మీటర్ల దూరం బల్లెం విసిరి స్వర్ణం సాధించాడు. అది రియోలో కాంస్య ప్రదర్శన (85.38 మీ.) కంటే మెరుగు కావడం విశేషం. కాబట్టి నీరజ్ రియోకు వెళ్లి ఉంటే అప్పుడే పతకం వచ్చేది. 2018 ఆసియా క్రీడల్లో నీరజ్ 88.06 మీ.తో నీరజ్.. రియో రజత విజేత ప్రదర్శనకూ (88.64 మీ.) చేరువగా వచ్చాడు. ఈ రెండు ప్రదర్శనలతోనే అర్థమైపోయింది.. నీరజ్ ఒలింపిక్ పతక రేసులో ఉన్నాడని.