క్రీడాకారులు తమ ప్రొఫెషనల్ ఆటను కాకుండా మరో క్రీడను ఆడుతుంటే కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఇదే విధంగా టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం ముద్దాడిన నీరజ్ చోప్డా(Tokyo olympics Neeraj chopra) హాకీ ఆడితే.. హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఈటె విసిరితే ఎలా ఉంటుంది? ఊహించడానికి చాలా బాగుంది కదూ.. ఇదే దృశ్యం పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సన్మాన సభకు విచ్చేసిన ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఇలా జరిగింది
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తమ పూర్వ విద్యార్థులు 13 మందికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. వారికి నగదు బహమతి ప్రకటించింది. వీరిలో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్డా, కాంస్య పతకం అందుకున్న హాకీ పురుషుల జట్టు సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. ఇందులో భాగంగానే నీరజ్.. హాకీ జట్టుతో కలిసి ఆడగా.. హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ బల్లెం విసిరి వీక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు.