మీరాబాయి చాను.. ఇప్పుడు ఈ పేరంటే తెలియని వారుండరు. అత్యంత పేదరికం నుంచి ఉత్తుంగ తరంగంలా ఎదిగి అంతర్జాతీయ క్రీడా యవనికపై మెరిసింది. కుటుంబ పరిస్థితులు ప్రతిభకు ప్రతిబంధకం కాదని నిరూపించి అసాధారణ ప్రతిభ కలిగి ఉన్న మరెందరికో ప్రేరణగా నిలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో వెండితునక సాధించి భారతజాతిని అబ్బురపర్చిన మీరాబాయి.. తన నిరాండంబరతతో అంతకుమించిన ప్రశంసలు అందుకుంటోంది.
అవేవీ అడ్డుకాదు..
కలలను సాకారం చేసుకునేందుకు పేదరికం అడ్డుకాదని టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి రజత పతకం సాధించిపెట్టిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను నిరూపించింది. అత్యంత పేదరికం నుంచి అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్‌గా ఎదిగిన ఆమె టోక్యో విశ్వక్రీడల్లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. ఒలిపింక్స్ లాంటి అత్యున్నత స్థాయి వేదికపై సత్తా చాటడమంటే మామూలు విషయం కాదు. డబ్బు, దర్పం, ప్రోత్సాహం ఇత్యాదికాలు ఉన్నా పతకం సాధించటం అంత తేలికకాదు. అయినా మీరాబాయి ఇవేవీ లేకుండానే టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని ముద్దాడింది. వెండి పతకంతో మట్టిలో మాణిక్యంలా మెరిసింది.