మీరాభాయ్ చాను.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. టోక్యో ఒలింపిక్స్‌లో వెండి గెలుచుకున్న ఈ మణిపూరి వెయిట్‌లిఫ్టర్.. విశ్వక్రీడల్లో భారత పతకాల పట్టికను తెరిచింది. ఈ ఘనత వెనకు చాను అసాధారణ కృషి దాగి ఉంది.
ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో ఘోరంగా విఫలమైంది మీరా. పతకం సాధిస్తుందనుకున్న ఆమె తీవ్ర నిరాశ మిగిల్చింది. కానీ అమె వెనకడుగు వేయలేదు. 2021లో జరిగిన ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అదే క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో ఏకంగా 119 కేజీల బరువు ఎత్తి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇలా ప్రస్తుత విశ్వక్రీడలకు అర్హత సాధించింది.
49 కేజీల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరా.. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు(మొత్తంగా 202 కేజీలు) ఎత్తి సిల్వర్ మెడల్‌ను ముద్దాడింది.
కెరీర్ ఆరంభంలో దూసుకుపోయింది మీరా. గ్లాస్గో వేదికగా 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అంచనాలను అందుకుంది. తర్వాత రెండు మూడేళ్లు అంతగా ఆకట్టుకోలేదు. 2017లో వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణంతో మెరిసింది. 2018లో వెన్నుగాయంతో ఆటకు దూరమైంది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారిగా 200 కేజీలను లిఫ్ట్ చేసింది.
ఇదీ చదవండి:Olympics India: వెండితో మెరిసిన మీరా.. హాకీ, టీటీలో అదుర్స్
ఓటమి పాఠాలతో..
ఒలింపిక్స్‌లో పతకం గెలవడంపై మీరాభాయ్ స్పందించింది. 2016 రియో ఓటమి నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించింది.
"టోక్యోలో పతకం గెలిచినందుకు సంతోషంగా ఉంది. దేశం మొత్తం నావైపు చూస్తోంది. వారికి చాలా అంచనాలు ఉంటాయి. మొదట్లో కొంత భయపడ్డాను. కానీ, నా శక్తిమేరకు ప్రయత్నించాలని అనుకున్నాను. రియోలో నేను ఘోరంగా విఫలమయ్యాను. కానీ, దాని నుంచి చాలా నేర్చుకున్నాను. ఎక్కడ నన్ను నేను మెరుగుపర్చుకోవాలో తెలుసుకున్నాను. ఒలింపిక్స్ కోసం చాలా కష్టపడ్డాను."
-మీరాభాయ్ చాను, భారత వెయిట్‌లిఫ్టర్.
"ఇండియాకు వెళ్లగానే ముందుగా మా ఇంటికి వెళ్లాలి. ఇంటికి దూరమై చాలా కాలమైంది. దాదాపు రెండేళ్లవుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి గడపాలి. ప్రస్తుతానికైతే అంతకు మించి ప్రణాళికలేమీ లేవు. కానీ, ఈ రోజు పార్టీ చేసుకోవాలి(నవ్వుతూ)" అని వెల్లడించింది.
గోల్డ్ మెడల్ కోసం ఎందుకు ప్రయత్నించలేదని అడిగిన ప్రశ్నకు.. "నేను బంగారు పతకం కోసం చాలా ప్రయత్నించాను. కానీ, అది దక్కలేదు. రెండో సారి వెయిట్‌లిఫ్ట్ చేసినప్పుడు నాకు పతకం పక్కా అనేది అర్థమైంది," అని చాను సమాధానంగా చెప్పింది.
కరణం మల్లీశ్వరీ(సిడ్నీ ఒలింపిక్స్-2000) తర్వాత ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన ప్లేయర్‌గా మీరాభాయ్ నిలిచింది. ఇక ఈ విభాగంలో వెండి పతకం సాధించిన తొలి వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది.
ఆనంద భాష్పాలు..
కూతురు ఒలింపిక్ పతకం గెలవడం వల్ల మణిపూర్‌లోని మీరాభాయ్ తల్లిదండ్రులు మురిసిపోయారు. కన్నీటితో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతకాలం మీరా పడిన కష్టానికి ఫలితం దక్కిందని చెప్పారు. బంధువులతో పాటు చుట్టుపక్కల వారు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారని తెలిపారు. చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారన్నారు.
ఇదీ చదవండి:మీరాబాయికి ప్రశంసల వెల్లువ- రాష్ట్రపతి, ప్రధాని ట్వీట్