ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్.. తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నారని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా పేర్కొంది. అయితే దానికి తాను అంగీకరించలేదని తెలిపింది. అందువల్లే టోక్యో ఒలింపిక్స్‌లో ఆయన సహాయం తీసుకోలేదని టేబుల్ టెన్నిస్ సమాఖ్య కార్యదర్శి అరుణ్ బెనర్జీకి ఆమె చెప్పింది.
"ఒలింపిక్స్‌లో జాతీయ కోచ్ సహాయం లేకుండా ప్రదర్శన చేయడం పట్ల చాలా పెద్ద కారణమే ఉంది. ఈ ఏడాది మార్చిలో దోహా వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో ఆయన స్టూడెంట్ అర్హత సాధించేందుకు నాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేయించాలని చూశాడు"
- మనికా బాత్రా, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి
"సౌమ్యదీప్ రాయ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలున్నాయి. దీనిపై ఆయన స్పందించిన తర్వాత భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తాం" అని షోకాజ్ నోటీసులో టీటీఏఫ్ఐ కార్యదర్శి బెనర్జీ ప్రకటించారు.
కోచ్ రాయ్ తనతో మ్యాచ్ ఫిక్సింగ్ చేయించేందుకు పాల్పడ్డాడనే దానిపై తన దగ్గర ఆధారాలున్నాయని మనికా బాత్రా స్పష్టం చేసింది. "ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. సరైన సమయంలో వాటిని అధికారుల ముందు పెడతాను. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం నాతో మాట్లాడేందుకు జాతీయ కోచ్ నా వ్యక్తిగత హోటల్ గదిలో దాదాపుగా 20 నిమిషాల పాటు మాట్లాడారు. తన విద్యార్థి కోసం కోచ్ రాయ్ చేసిన అనైతిక మార్గాలను పాటించకూడదని నేను నిర్ణయించుకున్నాను. కానీ, ఆ సమయంలో అతడు నాపై చేసిన బెదిరింపులు, ఒత్తిడి నా ఆటపై ప్రభావం చూపాయి. అందుకే ఒలింపిక్స్‌లో ఆయన సహాయం నేను తీసుకోలేదు. ఎందుకంటే మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారిణిగా.. నా దేశానికి అత్యుత్తమ ప్రదర్శన చేయడం నా కర్తవ్యం" అని మనికా వెల్లడించింది.
తాను చేసిన ఆరోపణలపై టీటీఎఫ్ఐ విచారణ చేపట్టకపోవడంపై మనికా బాత్రా ఆవేదన వ్యక్తం చేసింది. కోచ్ రాయ్‌పై తక్షణ విచారణ ఎందుకు చేపట్టడం లేదని భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్యను ఆమె ప్రశ్నించింది.
ఇదీ చూడండి..భారత్ ఖాతాలో మరో పతకం- ఆర్చరీలో కాంస్యం