టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కైవసం చేసుకున్న బాక్సర్ లవ్లీనాది అసోంలోని బారొముథియా గ్రామం. కనీస సదుపాయాలు లేని ప్రాంతం అది. వానలొస్తే అక్కడి రహదార్లు దయనీయంగా మారతాయి. లవ్లీనా(Lovlina Borgohain) ఇంటికి వెళ్లే దారిది ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆమెకు పతకం రావడం ఆ ఊరి ప్రజల జీవితాలను మార్చేసింది. లవ్లీనా ఇంటికి చేరుకునే 3.5 కిలోమీటర్ల మార్గాన్ని అధికారులు మరమ్మత్తు చేస్తున్నారు. దాన్ని తారు రోడ్డుగా మారుస్తున్నారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే విశ్వజిత్ ఫుకాన్ చొరవ తీసుకున్నారు.
గర్వంగా ఉంది..
తమ రాష్ట్రానికి చెందిన లవ్లీనా.. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసోం రాష్ట్ర చరిత్రలో లవ్లీనా పేరు సువర్ణాక్షరాలతో లిఖిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఒలింపిక్స్ బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్య పతకం తెచ్చిపెట్టిన అసోం ఆడపడుచు లవ్లీనా బొర్గోహెన్‌కు అభినందనలు. అసోం రాష్ట్ర చరిత్రలో నీ పేరును సువర్ణ అక్షరాలతో లిఖించి ఉంటుంది. నీ అద్భుతమైన విజయం పట్ల దేశం ఎంతో గర్విస్తోంది."