తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా సోకి శిక్షణలో వెనుకపడినా.. ఆత్మస్థైర్యంతో! - లవ్లీనా బొర్గోహెన్​

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్‌లో(Olympics) ఆడటం ప్రతి అథ్లెట్‌ కల. అలాంటిది అరంగేట్రంలోనే కాంస్య పతకంతో సత్తా చాటింది 23 ఏళ్ల యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌(Lovlina Borgohain). పోటీలకు ముందు అనుకోకుండా కరోనా మహమ్మారి బారిన పడి కొంతకాలం పాటు శిక్షణకు దూరమైన ఆమె.. ఆత్మస్థైర్యంతో పోటీల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఓడినా ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చింది. మేరీకోమ్‌ తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌గా ఖ్యాతినార్జించింది.

Lovlina Borgohain's story is one of hardship and immense sacrifice
కరోనా సోకి శిక్షణలో వెనుకపడినా.. ఆత్మస్థైర్యంతో!

By

Published : Aug 4, 2021, 3:41 PM IST

ఒలింపిక్ బాక్సర్​ లవ్లీనా(Lovlina Borgohain).. అసోం గోలాఘాట్‌ జిల్లా బరోముథియా గ్రామంలో 1997 అక్టోబరు 2న జన్మించింది. తండ్రి చిరు వ్యాపారి. ఆమె కంటే పెద్దవారైన ఇద్దరు కవల సోదరీమణులు కిక్‌ బాక్సింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అక్కలను చూసి తన కూడా ముందు కిక్‌ బాక్సింగ్‌ను ఎంచుకుంది. జిల్లా స్థాయిలో పలు పోటీల్లో పాల్గొంది. ఒకరోజు స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆమె చదువుతున్న హైస్కూల్లో పోటీలు నిర్వహించింది. అందులో లవ్లీనా కూడా పోటీ పడింది. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రముఖ కోచ్‌ పదుమ్‌ బోరో ఆమెను కిక్‌ బాక్సింగ్‌ నుంచి బాక్సింగ్‌కు పరిచయం చేశారు. అలా 2012 నుంచి ఆమె బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది.

2017లో జరిగిన ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకోవడం వల్ల లవ్లీనా పేరు బాక్సింగ్‌ ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత 2018లో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ ఏడాది దిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అరంగేట్రం చేసిన లవ్లీనా.. 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. 2019లో రష్యాలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌లో మళ్లీ కాంస్య పతకం సాధించింది. ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్యాలు దక్కించుకుంది.

కరోనా నుంచి కోలుకుని..

2020 మార్చిలో జరిగిన ఆసియా అండ్‌ ఓషినియా బాక్సింగ్‌ ఒలింపిక్‌ అర్హత టోర్నీలో గెలిచి టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా బెర్తు ఖరారు చేసుకుంది. గతేడాది లవ్లీనా తల్లి మమోనీ బొర్గోహెన్‌కు కిడ్నీ మార్పిడి జరిగింది. తల్లిని చూసేందుకు స్వస్థలానికి వెళ్లిన లవ్లీనాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఒలింపిక్స్‌లో అర్హత సాధించిన బాక్సర్లకు సాయ్‌ కేటాయించిన 56 రోజుల యూరప్‌ శిక్షణ టూర్‌కు ఆమె వెళ్లలేకపోయింది. కరోనా సోకిన సమయంలో లవ్లీనా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. అయినా సానుకూల దృక్పథంతో కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వేగంగా శిక్షణ మొదలుపెట్టింది.

తొలిసారైనా బెరుకు లేకుండా..

లవ్లీనా ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) ఆడటం ఇదే తొలిసారి. అయినా భయపడలేదు. అదిరిపోయే పంచులతో క్వార్టర్స్‌ వరకు చేరింది. క్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌, చైనీస్‌ తైపీ బాక్సర్‌ నిన్‌-చిన్‌తో తలపడింది. 4-1 స్కోరుతో ఘన విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది. అక్కడ స్వర్ణ పతక ఫేవరెట్‌ టర్కీకి చెందిన సుర్మనెలితో పోరాడి ఓడింది. 0-5తో ఓటమి పాలైనా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మెప్పించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ముద్దాడేది కాంస్యమే అయినా 9 ఏళ్ల తర్వాత భారత బాక్సింగ్‌కు అందిన ఈ పతకం స్వర్ణంతో సమానమే!

ఇదీ చూడండి..లవ్లీనాకు పతకం వచ్చే.. ఇంటికి రోడ్డు తెచ్చే!

ABOUT THE AUTHOR

...view details