టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo paralympics javelin throw) స్వర్ణం సాధించినా తనకు సంతృప్తి దక్కలేదని అన్నాడు జావెలిన్ క్రీడాకారుడు సుమిత్ అంటిల్. అది తనకు ఉత్తమ ప్రదర్శన కాదని చెప్పాడు. భవిష్యత్‌లో మరింత అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని వెల్లడించాడు.
"ఇది నా తొలి పారాలింపిక్స్. గట్టి పోటీదారులు ఉండటం వల్ల కాస్త ఒత్తిడికి లోనయ్యా. ఈటెను 70-75 మీటర్ల దూరం విసురుతానని భావించా. కానీ అది జరగలేదు. ఇది నా ఉత్తమ ప్రదర్శన కాదు. అయితే ప్రపంచ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు చాలా సార్లు 71, 72మీటర్లు ఈటెను విసిరా. మరి ఇప్పుడు ఎందుకు విసరలేకపోయానో తెలియదు. ఒకటి మాత్రం పక్కా.. భవిష్యత్‌లో మరింత మంచి ప్రదర్శన చేస్తా. ఏదేమైనప్పటికీ నా కల నిజమైంది. నా అనుభూతి ఇప్పుడు మాటల్లో చెప్పలేను."
-సుమిత్, జావెలిన్ క్రీడాకారుడు.
సోమవారం (ఆగస్టు 30) జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో చరిత్ర సృష్టించాడు సుమిత్(Sumith Javelin Throw). ఎఫ్ 64 విభాగంలో 68.55 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో మూడుసార్లు ప్రపంచ రికార్డు(javelin throw world record) నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు.. రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే తిరగరాశాడు. ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా అది 68.55 మీటర్లు దూసుకెళ్లడం వల్ల కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో సుమిత్ గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పతకంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఏడు పతకాలు వచ్చాయి. అందులో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యం పతకాలు ఉన్నాయి.
అలా అథ్లెటిక్స్ వైపు
హరియాణాలోని సోనేపట్‌కు చెందిన సుమిత్(javelin throw world record paralympics) 2015 వరకు అందరి యువకుల్లానే సాదాసీదాగా ఉన్నాడు. అయితే, ఓ బైక్ యాక్సిడెంట్‌లో ఎడమకాలు పోగొట్టుకొని కృత్రిమకాలుతో జీవనం సాగిస్తున్నాడు. తన ఊర్లో ఉండే ఒక పారా అథ్లెట్‌ను చూసి సుమిత్ కూడా అథ్లెటిక్స్ వైపు దృష్టి మళ్లించాడు. అలా 2018లో జావెలిన్ త్రో విభాగంలో పోటీపడటం ప్రారంభించి ఇప్పుడు పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించేవరకు తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. ఈ క్రమంలోనే 2019లో దుబాయ్‌లో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఎఫ్-64 విభాగంలోనే పోటీపడి రజతం సాధించాడు. ఇక ఈ ఏడాది మార్చిలో పాటియాలాలో నిర్వహించిన ఇండియన్ గ్రాండ్ ప్రి సిరీస్ 3 పోటీల్లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో పోటీపడ్డాడు. అయితే, సుమిత్ అప్పుడు 66.43 మీటర్లతో ఏడో స్థానంలో సరిపెట్టుకున్నాడు. మరోవైపు చోప్రా 88.07 మీటర్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
ఇదీ చూడండి: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం