ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి. వాటిని దాటితేనే విజేతలుగా నిలుస్తారు. కానీ వీళ్ల జీవితమే కష్టతరమై.. జీవన ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా... వీళ్లు వెన్నుచూపలేదు. భయపడి చీకటిలోనే ఉండిపోలేదు. వైకల్యాన్ని అధిగమించి ఆటల్లో సత్తాచాటి వెలుగులోకి వచ్చారు. ఇప్పుడదే ఆటల్లో దేశం తరపున పారాలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు సిద్ధమయ్యారు. జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తారనే ఆశలు పుట్టిస్తున్నారు. మరివాళ్లెవరూ.. వాళ్ల నేపథ్యాలేంటి?
పారా అథ్లెట్ దిగ్గజం
టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ జావెలిన్ త్రోలో పసిడి గెలిచిన నీరజ్ చోప్డా దేశాన్ని సంతోషంలో ముంచెత్తాడు. కానీ అతని కంటే ముందే జావెలిన్ త్రోలో పారాలింపిక్స్‌ల్లో రెండు న్వర్జాలు గెలిచిన అథ్లెట్ ఒకరున్నారు. అతనే, భారత పారా అథ్లెట్ దిగ్గజం దేవేంద్ర జజారియా. జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఈ రాజస్థాన్ అద్లెట్.. గత 2016 రియో క్రీడల్లో మరోసారి పసిడి అందుకున్నాడు. మధ్యలో 12 ఏళ్ల పాటు పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో ఎఫ్46 విభాగంలో పోటీలు నిర్వహించలేదు. లేకపోతే దేవేంద్ర ఖాతాలో మరికొన్ని ఒలింపిక్స్ పతకాలు చేరేవి! అతని జావెలిన్ ఎప్పుడూ ప్రపంచ రికార్డునే ముద్దాడుతుంది. 2004లో స్వర్ణం సాధించినపుడు ప్రపంచ రికార్డు సృష్టించిన అతను.. రియోలోనూ ఆ రికార్డును తానే మెరుగుపర్చాడు. ఈ ఏడాది జులైలో 65.71 మీటర్ల దూరం ఈటెను విసిరి మళ్లీ తన రికార్డును మెరుగుపర్చుకున్న ఈ 40 ఏళ్ల అథ్లెట్‌పై టోక్యోలో కచ్చితంగా పోడియంపై నిలబడతాడనే అంచనాలున్నాయి. ఎనిమిదేళ్ల వయసులో ఓ చెట్టు ఎక్కే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై తన ఎడమ చేతిని మోచేతి వరకు కోల్పోయిన దేవేంద్ర.. ఇప్పుడు టోక్యోలో హ్యాట్రిక్ స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.
పలక్ కోహ్లీ..
పాఠశాలలో అందరితో కలిసి ఆడుకునే అవకాశం పలక్ కోహ్లీకి లేకపోయింది. పుట్టుకతోనే వచ్చిన తన వైకల్యాన్ని చూసి మిత్రులు దూరం పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆటలు అవసరమా.. బుద్ధిగా చదువుకో అని ఉపాధ్యాయులూ చెప్పారు. ఇప్పటికే ఓ చేయి సరిగ్గా లేదు.. ఉన్న ఇంకో చేతిని పాడు చేసుకుంటావా! అని గద్దించారు. దీంతో తానెంటో నిరూపించాలని ఆ అమ్మాయి గట్టిగా అనుకుంది. ఆటల్లో సత్తాచాటాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో పారా బ్యాడ్మింటన్ కోచ్ గౌరవ్ ఖన్నా అమెకు అండగా నిలిచాడు. అంతకంటే అరు నెలల ముందే ఆమెను బ్యాడ్మింటన్‌లోకి రావాలని ఆహ్వానించిన అతను.. ఇక ఆ తర్వాత పలక్‌కు ఉత్తమ శిక్షణ అందించాడు. క్రమంగా ఆటపై పట్టు సాధించిన ఆమె ఆతి తక్కువ సమయంలోనే టోర్నీల్లో పతకాలు సాధించడం మొదలెట్టింది. అంతర్జాతీయ టోర్నీల్లోనూ సింగిల్స్, డబుల్స్‌లో సత్తాచాటింది. తన ర్యాంకింగ్స్‌తో టోక్యో పారాలింపిక్స్‌కు (Tokyo paralympics) అర్హత సాధించి.. ఆ ఘనత అందుకున్న అతి పిన్న వయస్సు షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. పూర్తిగా ఎదగని ఎడమచేతితో పుట్టిన 19 ఏళ్ల ఈ పంజాబ్ చిన్నది.. ఇప్పుడు టోక్యోలో ఎస్‌యూ5 సింగిల్స్ విభాగంతో పాటు మిక్స్‌డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌లోనూ పోటీపడే అవకాశం కొట్టేసింది. ఈ పారాలింపిక్స్‌ల్లో పతకంతో తన సామర్థ్యంపై ప్రజలు పెట్టుకున్న అనుమానాలు పటాపంచలు చేయాలనే పట్టుదలతో ఉంది.
కష్టాల నుంచి ఎగిరాడు
ఆ కుటుంబంలో మొత్తం ఆరుగురు పిల్లలు. అయిదు కొడుకులు, ఓ తనయ. తండ్రి ఆ కుటుంబాన్ని విడిచి తన దారి తాను చూసుకోవడం వల్ల ఆ తల్లి రోజూ కూరగాయాలు అమ్మి పిల్లలను పెంచింది. అందులో ఓ అబ్బాయి.. మరియప్పన్ తంగవేలు అయిదేళ్ల వయసులో చలాకీగా పాఠశాలకు వెళ్తున్నాడు. ఓ రోజు అలాగే వెళ్తున్న అతని పాలిట ఓ బస్సు శాపమైంది. మద్యం మత్తులో ఉన్న డైవర్ నడిపిన ఆ బస్సు చక్రాలు ఆతని కుడి కాలి మీద నుంచి వెళ్లాయి. దీంతో మోకాలి కింద నుంచి ఆతని కాలు మొత్తం నుజ్జునుజ్జు అయింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఆ తర్వాత అతను సాధారణంగా నడవలేకపోయాడు. కానీ మిగతా పిల్లలకంటే తానేమీ తక్కువ కాదనే ఆత్మవిశ్వాసంతో సాగాడు. పాఠశాలలో ఓ సారి పీటీ ప్రోత్సాహంతో హైజంప్‌లో పాల్గొన్న అతను ఇక అప్పటి నుంచి దాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. పోరాటమే ఆయుధంగా మలుచుకుని గత రియో క్రీడల హైజంప్ టీ42 విభాగంలో పసిడి గెలిచే స్థాయికి చేరాడు. 28 ఏళ్ల ఈ తమిళనాడు అద్లెట్ 2019 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపయన్‌షిప్స్‌లో కాంస్యంతో మెరిశాడు. ఇప్పుడు టోక్యోలో పారాలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించనున్న అతను.. స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.