అక్కడ జరిగింది క్రికెట్ మ్యాచ్ కాదు. కానీ భారత క్రీడాభిమానులు ఉత్కంఠతో ఊగిపోయారు! ఆడినోళ్లు సూపర్ స్టార్లు కాదు. కానీ వాళ్ల ఆట చూసి రోమాలు నిక్కబొడుచుకున్నాయ్! గెలిచింది కాంస్యమే. కానీ సంబరాలు చూస్తే మాత్రం 'స్వర్ణోత్సవాల'ను మించిపోయాయి.
ఎప్పుడూ మౌనంగా ఉండే ఓ పెద్దాయన టీవీ ముందు కూర్చుని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. దేనికీ చలించనట్లుగా ఉండే స్పోర్ట్స్ షాప్ యజమాని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. స్టోర్ రూంలో బూజు పట్టిన హాకీ స్టిక్‌ను బయటికి తీసిన ఓ మాజీ ఆటగాడు సింహనాదం చేస్తున్నాడు.
ఇలా కోట్లమందిలో భావోద్వేగాలను తట్టి లేపి పతాక స్థాయికి తీసుకెళ్లిన విజయమిది. మన హాకీ ఐసీయూకు చేరిందంటూ ఎద్దేవా చేసిన వాళ్లకు.. మన జట్టా ఒలింపిక్ పతకమా అంటూ హేళన చేసిన వాళ్లకు.. ఇదీ ఆ ఆటలో ఉండే మజా, ఇదిగో మా సత్తా అంటూ నవ యువ హాకీ వీరులు చేసిన సింహనాదం ఈ విజయం.
ప్రపంచకప్ కంటే గొప్పే
"1983, 2007, 2011లను మరిచిపోండి. హాకీలో సాధించిన ఈ పతకం ప్రపంచకప్ కంటే గొప్పది" ఈ మాట ఏ హాకీ మాజీ క్రీడాకారుడో అని ఉంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన గౌతమ్ గంభీర్ గురువారం ఉదయం వేసిన ట్వీట్ ఇది. క్రికెట్ మైకంతో ఊగిపోయే దేశంలో ఒక స్టార్ క్రికెటర్ ఈ వ్యాఖ్య చేశాడంటేనే ఈ విజయం ఎంత గొప్పదో, టోక్యోలో హాకీ వీరులు సాధించిన కాంస్యానికి ఉన్న ప్రాధాన్యతేంటో అర్థం చేసుకోవచ్చు. ఒక క్రికెటర్ స్పందనే ఇలా ఉంటే.. హాకీనే ఆశగా, శ్వాసగా బతికే వాళ్లు.. ఆ ఆట కోసం పడి చచ్చే అభిమానుల ఉద్వేగాన్ని కొలవగలమా?
ప్రతిసారీ నిరాశే!
ఒలింపిక్స్‌లో ఎవరో ఒకరు.. ఏదో ఒక పతకం తెస్తే ఎంతగా సంబరాలు చేసుకుంటున్నామిపుడు? మరి విశ్వ క్రీడల్లో ఓ ఆటలో వరుసబెట్టి స్వర్ణాలు గెలుస్తుంటే.. ఏకంగా ఎనిమిది పసిడి పతకాలు మన జట్టు సొంతమైతే.. అప్పటి అభిమానుల ఉద్వేగం, ఆనందం ఎలా ఉండి ఉంటుందో ఓసారి ఊహించుకోండి. భారత జట్టు ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతుంటే.. స్వర్ణం సంగతి వదిలేసి మిగతా జట్లు వేరే పతకాల మీద దృష్టిపెట్టేవంటే పరిస్థితి ఎలా ఉండేదో అంచనా వేయొచ్చు. కానీ మనల్ని చూసి ఆట నేర్చుకుని ఓ స్థాయి అందుకున్న దేశాలన్నీ.. తర్వాతి కాలంలో ఆటను కొత్త పుంతలు తొక్కించి ముందుకెళ్లి పోతే మనోళ్ల ఆట పాతాళానికి పడిపోయారు! కాలానుగుణంగా ఆటను మార్చకుండా, దూకుడు కోల్పోయి, సమష్టితత్వం అన్న మాటే లేక పతనావస్థకు చేరిన భారత హాకీని చూసి జాలిపడటం తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి!
కోరిక నెరవేరలేదు
2016లో "రియో ఒలింపిక్స్‌లో మా ఆటనే కాదు.. సిక్స్ ప్యాక్‌లనూ చూపిస్తాం" అంటూ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ చేసిన ప్రకటనతో అభిమానుల్లో ఏదో కాస్త ఆశ మొదలైంది. కానీ మన జట్టు అట్టడుగున 12వ స్థానంతో ఒలింపిక్స్‌ను ముగించాక మనవాళ్లు శరీరాకృతులు మార్చారు కానీ, ఆటను పదునెక్కించలేకపోయారని అర్థమైపోయింది. కానీ కోల్పోవడానికి ఇంకేమీ లేని స్థితిలో మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడమే భారత హాకీని మలుపు తిప్పింది. టోక్యోలో గోల్స్ కొట్టిన పదిమంది భారత ఆటగాళ్లలో తొమ్మిది మంది 2016 జూనియర్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులు. ఈ విజయానికి ఎక్కడ పునాది పడిందో చెప్పడానికిది రుజువు.
మార్పుకిది సంకేతం
భారత జట్టు ఆధిక్యంలో ఉంటుంది. మ్యాచ్‌లో కొన్ని నిమిషాలే మిగిలుంటుంది. మనదే విజయం అన్న ధీమాలో ఉండగా.. ప్రత్యర్థి జట్టు మెరుపు దాడి చేసి గోల్స్ మీద గోల్స్ కొట్టేస్తుంది. మ్యాచ్‌ను ఎగరేసుకుపోతుంది.. హాకీలో ఇలాంటి షాక్‌లు ఎన్నెన్నో! అలాగే కొన్ని జట్లను చూసి ముందే బెదిరిపోయి మ్యాచ్‌లు అప్పగించేయడమూ భారత హాకీ ఆటగాళ్లకు అలవాటే! వీటిని మార్చడం వల్లనే భారత హాకీ మలుపు తిరిగింది. బెదురన్నది లేకుండా ఆడే కుర్రాళ్లను తీసుకొచ్చి జట్టుకు యువరక్తం ఎక్కించడం.. గ్రాహమ్ రీడ్ లాంటి మంచి కోచ్‌ను నియమించడం.. ఆటగాళ్ల ఫిట్‌నెస్ పెంచడం సహా మానసికంగా దృఢంగా తయారు చేయడం.. తరచుగా కఠినమైన విదేశీ పర్యటనలకు పంపి ఆటగాళ్లు రాటుదేలేలా చేయడం వల్ల నెమ్మదిగా మన జట్టు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుంది. పెద్ద జట్లను ఆత్మవిశ్వాసంతో ఆడటాన్ని అలవరుచుకున్న ఆటగాళ్లు సరికొత్త దృక్పథంతో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగారు. ఆస్ట్రేలియాతో పోరును మినహాయిస్తే ప్రతి మ్యాచ్‌లోనూ మన ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని గమనించవచ్చు. రక్షణాత్మక ధోరణిని వీడి దూకుడుగా ఆడటం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇంతకుముందు ఆధిక్యం నుంచి మ్యాచ్‌లు ఓడిపోవడమే చూశాం. కానీ వెనుకంజ వేసినా నమ్మకం కోల్పోకుండా దూకుడుగా ఆడి గెలవడం ఈ జట్టు ప్రత్యేకత. కాంస్య పోరులో జరిగింది అదే. గోల్స్ కొట్టినపుడు ఎగిరెగిరి పడలేదు. గోల్స్ కోల్పోయినపుడు నైరాశ్యంలో కూరుకుపోలేదు. ఇది ఆరంభం మాత్రమే అంటూ విజయానంతరం గట్టిగా నినదించిన యువ సారథి మన్‌ప్రీత్ సింగ్ మాటల్ని నిజం చేస్తూ భారత హాకీ రాబోయే కొన్నేళ్లలో పూర్వవైభవం దిశగా అడుగులేస్తే భారత హాకీ ప్రేమికులకు అంతకంటే ఏం కావాలి?