ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్ విభాగం ఒలింపిక్స్‌లో విఫలమవ్వడంపై భారత షూటింగ్ సమాఖ్య మంగళవారం ఓ ప్రకటన చేసింది. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న తమ 15 షూటింగ్ బృందాలపై మరింత దృష్టిసారించి.. సరైన మార్గంలోకి తెస్తామని భారత షూటింగ్ సమాఖ్య వెల్లడించింది. కోచింగ్, సహాయక సిబ్బంది విషయాల్లో మార్పులు జరుగుతాయని ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.
"కచ్చితంగా.. మా అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కోచింగ్, సహాయక సిబ్బంది సమగ్ర మార్పు గురించిన నేను మాట్లాడాను. ఒలింపిక్స్ లాంటి పెద్ద ఈవెంట్లలో మన షూటర్లను సిద్ధం చేయడంలో ఏదో లోపం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే వారి ప్రతిభ ఎంటో ప్రపంచకప్ ఈవెంట్లో చూశాం. కానీ, ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రియో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ఘోరమైన వైఫల్యం తర్వాత.. ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా నేతృత్వంలో ప్యానెల్ ఏర్పాటుచేసి సిఫారసులు అమలు చేయడం సహా.. క్రీడాకారులకు అవసరాలను తీర్చేందుకు ఫెడరేషన్ సహా ఇతర వాటాదారులు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్ ప్రదర్శనల చర్చ గురించి కాకుండా అథ్లెట్లకు మద్దతు ఇవ్వడం ముఖ్యం. భవిష్యత్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం".