భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్(Lovlina Borgohain) చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. 'మాగ్నిఫిసెంట్ మేరీ' తర్వాత పతకం ముద్దాడుతున్న రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో(Tokyo Olympics) ఆమెకు దక్కింది కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానమే! ఎందుకంటే భారత బాక్సింగ్‌కు 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందిస్తోంది. అంతేకాదు.. అరంగేట్రం మెగా క్రీడల్లోనే పోడియంపై నిలబడిన బాక్సర్‌గా దేశానికి వన్నె తెచ్చింది.
అంతర్జాతీయ బాక్సింగ్‌లో అంతగా అనుభవం లేని లవ్లీనాకు సెమీస్ పోరు సులభం కాదని అందరికీ తెలుసు. టర్కీకి చెందిన ప్రత్యర్థి సుర్మెనెలి (Busenaz Sürmeneli) స్వర్ణ పతకానికి ఫేవరెట్! ఈ ఏడాది ఆమె రెండు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. గతంలో మిడిల్ వెయిట్ (75 కిలోలు) ఆడిన ఆమె ఈ సారి 69కిలోల విభాగంలో తలపడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 16 సార్లు పతకాలు కొల్లగొట్టింది. పిడిగుద్దులు, హుక్స్, బాడీ షాట్స్‌తో విరుచుకుపడే సుర్మెనెలిపై లవ్లీనా స్ఫూర్తిదాయకంగా పోరాడింది.
సెమీస్‌లో లవ్లీనా 0-5 తేడాతో ఓటమి పాలైంది. వరుసగా మూడు రౌండ్లలో సుర్మెనెలి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. తొలి రౌండ్లో లవ్లీనా కొన్ని పంచులు బాగానే విసిరింది. వాటిని ప్రత్యర్థి తన డిఫెన్స్‌తో అడ్డుకొంది. దాంతో 50-45తో సుర్మెనెలి మొదటి రౌండ్ గెలుచుకుంది. ఇక రెండో రౌండ్లో ఆమె మరింత రెచ్చిపోగా లవ్లీనా రక్షణాత్మక ధోరణి కనబరిచింది. ఇక చివరి రౌండ్లో ఆమె మరింత తేలిపోయింది. ఆఖరికి 30-26, 30-26, 30-25, 20-25, 30-25 టర్కీ బాక్సర్ ఘన విజయం అందుకుంది.
ఒలింపిక్ క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్‌కు పతకం అందిస్తున్న మూడో బాక్సర్ లవ్లీనానే కావడం విశేషం. అంతకుముందు 2008లో విజేందర్ సింగ్(Vijender Singh), 2012లో మేరీకోమ్(Mary Kom) ఒలింపిక్ పతకాన్ని ముద్దాడారు. అయితే వారిద్దరికీ కాంస్య పతకాలే దక్కాయి. 69 కేజీల విభాగంలో తొలి పతకం అందిస్తున్నది మాత్రం లవ్లీనానే. ఆమె గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు గెలిచింది.
ప్రధాని అభినందనలు
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించిన బాక్సర్ లవ్లీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె పోరాటం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందని ఆయన కొనియాడారు. లవ్లీనా భవిషత్తులోనూ మరిన్ని పతకాలు సాధించాలని మోదీ సూచించారు.