టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం జరిగిన హాకీ క్వార్టర్స్‌లో భారత మహిళల జట్టు.. ప్రపంచ నంబరు.2 జట్టైన ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో గెలుపొంది.. సెమీఫైనల్‌కు చేరింది. విశ్వక్రీడల్లో భారత మహిళా హకీ జట్టు సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 1980 మాస్కోలో జరిగిన విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మెగాక్రీడల్లో మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయడం విశేషం. దీంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు హాకీ జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
"ఈ ఆటలో భారత జట్టు ఎక్కడా తగ్గలేదు. జోరు ప్రదర్శిస్తూనే ఉంది. ఆస్ట్రేలియా జట్టుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘనతంతా డిఫెన్స్, గోల్ కీపర్‌కు చెందుతుంది. పతకం గెలవడానికి చాలా దగ్గరగా ఉన్నాం. గతంలో హాకీలో జట్టు స్వర్ణం సాధించింది. ఈ సారి కూడా సాధిస్తుందని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్."
-అశోక్ ధ్యాన్ చంద్, మాజీ హాకీ కెప్టెన్.
"అద్భుత ప్రదర్శన.. టోక్యో ఒలింపిక్స్ 2020లో టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. జట్టుకు నా అభినందనలు. ఆస్ట్రేలియాపై నెగ్గి విశ్వక్రీడల్లో తొలిసారి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాం. మహిళలు.. మీ వెన్నంటే మేము ఉన్నాము."
-అనురాగ్ ఠాకుర్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి.