టోక్యో ఒలింపిక్స్‌లో రెండో రోజు కూడా భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పీవీ సింధు, మనికా బత్రా, రోయింగ్ జోడీ, బాక్సింగ్‌లో మేరీ కోమ్ ముందడుగు వేశారు.
జులై 25 ఫలితాలు
షూటింగ్
ఆదివారం జరిగిన షూటింగ్ పోటీల్లోనూ భారత్‌కు నిరాశ తప్పలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, యశస్విని దేస్వాల్.. వరుసగా 12,13 స్థానాల్లో నిలిచారు. దీంతో కచ్చితంగా పతకం వస్తుందనుకున్న విభాగంలో నిరాశే ఎదురైంది.
అయితే పిస్టల్‌లో సాంకేతిక లోపం వల్ల దాదాపు 20 నిమిషాల పాటు మను ఆట నిలిచిపోయింది. కాకింగ్ లెవల్ బ్రేక్‌డౌన్ కావడం వల్ల ఆమె గురితప్పింది. దీంతో ఫైనల్లో చోటు దక్కక, నిరాశగా వెనుదిరిగింది.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల క్వాలిఫికేషన్ రౌండ్‌లో దీపక్ కుమార్(624.7), పన్వర్ దివ్యాంశ్ సింగ్(622.8).. 26,32 స్థానాల్లో నిలిచారు. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.
షూటింగ్ మెన్స్ స్కీట్ క్వాలిఫికేషన్ తొలిరోజు మూడురౌండ్లు పూర్తయ్యాయి. భారత షూటర్లు అంగద్ వీర్ సింగ్ బజ్వా 11వ, మిరాజ్ అహ్మద్ ఖాన్ 25వ స్థానాల్లో నిలిచారు. మిగతా రెండు రౌండ్లు సోమవారం(జులై 26) జరగనున్నాయి. టాప్-6లో నిలిచినవారు ఫైనల్‌కు వెళ్తారు.
బ్యాడ్మింటన్..
పతకమే లక్ష్యంగా బరిలో దిగిన స్టార్ షట్లర్ పీవీ సింధు బోణీ కొట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో.. ఇజ్రాయెల్‌కు చెందిన పోలికర్పోవాను వరుస సెట్లలో ఓడించింది. 21-7, 21-10 తేడాతో చిత్తు చేసింది.
రోయింగ్..
రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్ లాల్, అర్వింద్ సింగ్ జంట అదరగొట్టింది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్‌లో టాప్-3లో నిలిచి సెమీఫైనల్ A/Bకు అర్హత సాధించింది. జులై 27న గెలిస్తే పతక అవకాశాలు మెరుగుపడతాయి.
జిమ్నాస్టిక్స్
ఒలింపిక్స్‌లో మన దేశం తరఫున పాల్గొన్న ఏకైక జిమ్నాస్ట్ ప్రణిత నాయక్ క్వాలిఫికేషన్ రౌండ్లోనే ఓడింది. నాలుగు విభాగాల్లో కలిపి 42.565 స్కోరు చేసి 29వ స్థానంలో నిలవడం వల్ల ఈ విభాగంలో భారత్ కథ ముగిసింది.