జపాన్‌లో ఎండలకు తాళలేక స్టార్ టెన్నిస్ ప్లేయర్ మెద్వదేవ్ అవస్థలు పడ్డాడు. మ్యాచ్ మధ్యలో పలుమార్లు విరామం కోరాడు. పదేపదే తన కుర్చీ దగ్గరికెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. రెండుసార్లు మెడికల్ ట్రీట్మెంట్ కావాలన్నాడు.
మెద్వదేవ్ అసౌకర్యాన్ని గమనించిన చైర్ అంపైర్ కార్లోస్ రామోస్.. ఆటను కొనసాగిస్తారా అని అడిగాడు. స్పందించిన మెద్వదేవ్.. "ఆటను పూర్తి చేస్తాను కానీ, ఈ ఉక్కపోతకు తట్టుకోలేక నేను చనిపోతాను" అని సమాధానంగా చెప్పాడు. "ఒక వేళ నేను చనిపోతే, అందుకు మీరు బాధ్యత వహిస్తారా?" అని అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు ఈ రెండో సీడ్ ప్లేయర్.
ఈ వేడి నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని రష్యా ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ) ఆటగాడు మెద్వదేవ్ తెలిపాడు. టెన్నిస్ పోటీలను సాయంత్రం వేళ నిర్వహిస్తే ఏమవుతుందని నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై తనతో పాటు నొవాక్ జకోవిచ్ వంటి అగ్ర ఆటగాళ్లు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోరా? అని ఆగ్రహించాడు.
ఫాబియో ఫోగ్నినితో జరిగిన మ్యాచ్‌లో 6-2, 3-6, 6-2తో గెలుపొందాడు మెద్వదేవ్. క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కొంతసేపు వర్షం పడింది. దీంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. అప్పటి వరకు 31 డిగ్రీలుగా ఉన్న వేడి వర్షం కారణంగా మరింత ఎక్కువైంది.
ఇదీ చదవండి:Olympics: వాటిని అధిగమించి 'టోక్యో' గెలిచింది!