టోక్యో పారాలింపిక్స్(Tokyo Paralympics) పురుషుల డిస్కస్ త్రో రజత పతకంతో మెరిశాడు భారత క్రీడాకారుడు యోగేశ్ కతునియా(Yogesh Kathuniya). అయితే ఆటలో అతడికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కనీసం కోచ్ కూడా లేరంటే మీరు నమ్ముతారా? అవును నిజం. యోగేశ్.. ఏడాది కాలంగా కోచ్ లేకుండానే ఆటలో మెళకువలు నేర్చుకొని సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ విషయంలో తన తల్లిది కీలకపాత్ర అని మెడల్ సాధించిన అనంతరం వెల్లడించాడు.
న్యూదిల్లీలోని కిరోరిమల్ కళాశాలలో బీ.కామ్ చదువుతున్న యోగేశ్ కతునియా.. టోక్యో పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో భారత్ తరఫున పోటీపడ్డాడు. ఆరో ప్రయత్నంగా 44.38 మీ. దూరం ఈటెను విసిరి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు.
"ఇదో అద్భుతమైన పరిణామం. 2024లో పారిస్ వేదికగా జరగనున్న పారాలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచేందుకు ఈ సిల్వర్ మెడల్ ఎంతో ప్రేరణనిస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా గత 18 నెలల్లో పోటీలకు సన్నద్ధమవ్వడం చాలా క్లిష్టంగా మారింది. ఆరు నెలల పాటు కొనసాగిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాలు మూతపడ్డాయి. లాక్డౌన్ అనంతరం స్టేడియంలోకి అడుగుపెట్టిన తర్వాత.. నాకు నేనుగా సాధన మొదలుపెట్టాను. ఆ సమయంలో నాకు సలహాలు, సూచనలిచ్చేందుకు కోచ్ కూడా లేరు. కోచ్ లేకుండానే రజత పతకం గెలవడం ఓ గొప్ప అనుభూతి".
- యోగేశ్ కతునియా, పారా డిస్కస్ త్రో క్రీడాకారుడు