అఫ్గానిస్థాన్‌కు చెందిన పారా అథ్లెట్ జకియా ఖోదాదాది.. ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు సాయం చేయాలని ప్రపంచదేశాలతో పాటు మహిళా సంరక్షణా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. పారాలింపిక్స్‌లో తన దేశం తరఫున తొలి పారా క్రీడాకారిణిగా ఘనత సాధించాలనే ఆశయంతో ఉన్నట్లు ఆమె వెల్లడించింది.
"మా అఫ్గానిస్థాన్ పౌరుల తరఫున ఓ మహిళగా నేను వేడుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని కాపాడండి. నాకు టోక్యో పారాలింపిక్స్ 2020లో పాల్గొనాలని ఉంది. నా చేతులు పట్టుకొని నన్ను ఈ చెర నుంచి విడిపించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలతో పాటు మహిళా హక్కుల సంరక్షకులను ఓ మహిళగా అభ్యర్థిస్తున్నాను. పారాలింపిక్స్‌లో అఫ్గానిస్థాన్ తరఫున ప్రాతినిధ్యం వహించే ఆశలను అంత త్వరగా కోల్పోనివ్వకండి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనమే సహాయపడాలి. ఇప్పటివరకు మనం ఎన్నో సాధించాం. ఇప్పుడు దీన్ని చిన్న విషయంగా పరిగణించవద్దు. నా పోరాటం ఫలించదని.. దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదని నేను భావించను. నాకు సహాయం చేయండి".