"చాను.. చాను" ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతున్న పేరు ఇది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చాను ఇప్పుడు దేశంలో ఓ సూపర్ హీరో! వెయిట్‌లిఫ్టింగ్ మహిళల 49 కేజీల విభాగంలో.. రజతం గెల్చుకుని స్వదేశానికి తిరిగొచ్చిన చానుపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ద్వారా "ఈటీవీ భారత్" చానును ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది చాను.
దేశం తరఫు రజత పతకం గెలవడం ఎలా అనిపించింది?
ఇదొక గొప్ప అనుభూతి. మాటల్లో చెప్పడం కష్టం. దేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి నాపై దేశ ప్రజలు ప్రేమ చూపిస్తున్నారు. విమానంలో, ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది.
మీకు పిజ్జా అంటే ఇష్టమన్నారు కదా. ఇప్పటివరకు ఎన్ని పిజ్జాలు తిన్నారు?
(నవ్వుతూ)చాలా పిజ్జాలు ఆరగించేశాను. ఇండియాకు తిరిగి వచ్చినప్పటి నుంచి పిజ్జాలే తింటున్నా. లెక్క పెట్టలేనన్ని తిన్నా.
ఐదేళ్ల ముందు జరిగిన రియో ఒలింపిక్స్ క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మీరు గెలవలేకపోయారు. కానీ వెనకడుగు వేయలేదు. ఈ విషయంలో మీకు ఏ విధంగా స్ఫూర్తి లభించింది?
నేను అరంగేట్రం చేసింది రియో ఒలింపిక్స్‌లోనే. చాలా కష్టపడ్డా. రియోలో గెలిచే అవకాశం వచ్చింది. రియో ట్రయల్స్‌లో ఎత్తిన బరువును.. ప్రధాన ఈవెంట్లో ఎత్తి ఉంటే అక్కడ కూడా రజతం దక్కేది. కానీ అది జరగలేదు. ఆ రోజున దేశానికి పతకం తీసుకురానందుకు చాలా బాధపడ్డా. ఎంత కష్టపడ్డా, ఎంత కఠోర శిక్షణ తీసుకున్నా.. ఎందుకు ఓడిపోయానో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎన్నో రోజులు సరిగ్గా తినలేదు. ఆ సమయంలో నా కుటుంబం, విజయ్ సర్ నాకు అండగా నిలిచారు. 'జరిగిందేదో జరిగిపోయింది.. ముందుముందు చాలా పోటీలున్నాయి' అని విజయ్ సర్ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. నేను సాధించగలనని ఆయన నాతో అన్నారు. ఆ తర్వాత జరిగే పోటీల్లో ఇంకా బాగా ఆడాలని నాకు నేను చెప్పుకొన్నా. నా మీద నేను నమ్మకం పెంచుకున్నా. ఇండియాకు తిరిగొచ్చాక మా అమ్మ నాతోనే ఉంది. నాలో చాలా స్ఫూర్తి నింపింది. విజయ్ సర్‌తో మాట్లాడిన తర్వాత నా టెక్నిక్, శిక్షణలో మార్పులు చేసుకున్నా. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్‌గా ఎదిగా. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో నా ప్రదర్శన నాలో నమ్మకాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత నేను ఆశలు వదులుకోలేదు.
లాక్డౌన్లో మీరు ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట పరిస్థితి ఏంటి?