తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics : ఒలిపింక్స్​లో మహిళలపై వివక్ష.. ఇంకెన్నాళ్లు? - Discrimination against women at the Tokyo Olympics 2020

ఒలింపిక్స్‌లో మహిళా ప్రాతినిధ్యం పెంచుతామని, 49 శాతం మహిళలు పాల్గొనేలా చూస్తామని... ఆ మేరకు నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో కొన్ని నిబంధనలు మహిళలపై వివక్ష ఇంకా తొలగలేదని రుజువు చేస్తున్నాయి.

ఒలిపింక్స్​లో మహిళలపై వివక్ష
ఒలిపింక్స్​లో మహిళలపై వివక్ష

By

Published : Jul 27, 2021, 2:10 PM IST

టోక్యో ఒలింపిక్‌లో ఆఫ్రికాకు చెందిన స్విమ్మింగ్‌ క్రీడాకారిణులు తలకు టోపీలు ధరించకూడదని తాజాగా ఓ నిబంధన వెలువడింది. ఈతకొట్టేటప్పుడు ఆఫ్రికా క్రీడాకారిణులు ధరించే సోల్‌క్యాప్‌ను తిరస్కరిస్తున్నట్లు ‘ద ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఫర్‌ కాంపిటేషన్స్‌ ఇన్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ (ఫినా)’ ప్రకటించింది. ఇకపై స్విమ్మింగ్‌లో ఈ క్యాప్‌కు స్థానం లేదని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీలు జరిగేటప్పుడు ముందుగా స్విమ్మింగ్‌ క్రీడాకారులు ధరించే దుస్తులు, టోపీ వంటి వాటి డిజైన్‌ను ఫినా వద్ద తయారీ సంస్థలు అనుమతి తీసుకోవాలి. గతేడాది రూపొందించిన సోల్‌క్యాప్‌ డిజైన్‌ను ది బ్రిటిష్‌ సంస్థ అనుమతి కోసం ఫినాకు పంపగా, పరిమాణంలో పెద్దగా ఉందంటూ దాన్ని నిరాకరించి, క్రీడాకారిణులందరినీ నిరాశకు గురిచేసింది. ఆఫ్రికా మహిళా స్విమ్మర్స్‌ తమ వంకీల జుట్టును సోల్‌క్యాప్‌లో ఉంచి ఈతకొలనులోకి దిగుతారు. ఇలా అయితే వీరికి ఏ ఆటంకమూ ఉండదు. తాజా నిబంధన వల్ల క్రాఫ్‌ లేదా స్ట్రెయిట్‌నింగ్‌ చేయించుకోవాలి. క్రీడల్లో పాల్గొనాలంటే హెయిర్‌స్టైల్‌ను మార్చుకోవడం తప్పనిసరి అనే భావం ప్రస్తుతం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఈ తరహా పద్ధతి అందరినీ నిరుత్సాహానికి గురి చేసిందని, భవిష్యత్తులో ఈ రంగంలోకి అడుగుపెట్టే యువక్రీడాకారిణులకు ఇదొక అవరోధంగా మారొచ్చని ద బ్లాక్‌ స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ పేర్కొంది. అంతేకాదు స్ట్రెయిట్‌నింగ్‌కు వాడే రసాయనాల వల్ల క్యాన్సర్‌, ఆస్తమా వంటి అనారోగ్యాలకు గురిచేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఎన్నాళ్లీ వివక్ష అంటూ పలువురు ప్రముఖ క్రీడాకారిణులు ప్రశ్నిస్తున్నారు.

దుస్తులకూ పాయింట్లా!

సాధారణంగా మగ జిమ్నాస్ట్‌లు వదులుగా ఉండే షార్ట్‌ లేదా కాళ్లు కూడా కవర్‌ అయ్యేలా ప్యాంట్‌లను వేసుకుంటారు. కానీ అమ్మాయిల దగ్గరిచ్చేసరికి బోలెడన్ని షరతులు. వీళ్లు కాళ్లు మొత్తం కనిపించేలా లియోటార్డ్‌ దుస్తులనే ధరించాలి. అలా కాకుండా మొత్తం కప్పుతూ ఉండేలాంటివి వేసుకుంటే పాయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. జిమ్నాస్టిక్స్‌ చేసే క్రమంలో దుస్తులు పక్కకు తొలగుతాయన్న భయమే కాకుండా మగ జడ్జిల ముందు ప్రదర్శించడానికి ఇబ్బందిపడే జిమ్నాస్ట్‌లూ ఎంతోమంది. లైంగిక వేధింపుల సమస్యల తార్కాణాలూ లేకపోలేదు. ఈ సమస్యతోపాటు మతపరమైన అంశాల దృష్ట్యా నచ్చిన దుస్తులు వేసుకునే వీలు కల్పించమంటే గతంలో అనుమతివ్వలేదు. దీంతో చాలామంది మహిళలు జిమ్నాస్టిక్‌ చేసే క్రమంలో దుస్తులను బంకతో ఒంటికి అతికించుకునేవారు. దీని వల్ల చర్మ సంబంధమైన సమస్యలెదురైనా ఈ విధానానికే మొగ్గు చూపేవారు. కానీ ఈ ఒలింపిక్స్‌లో జర్మనీ జిమ్నాస్ట్‌లు సెక్సువలైజేషన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈసారి మడమల వరకూ కప్పేసేలా ఉండే దుస్తులను ధరించారు. అలా హై కట్‌ బికినీ బాటమ్స్‌కు వ్యతిరేకంగా నిలిచారు. దుస్తుల ఎంపిక లైంగిక వేధింపులకూ ఆస్కార మివ్వదంటున్నారు. ఈ మార్పు ఏ దిశగా వెళుతుందో చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే మరి!

ABOUT THE AUTHOR

...view details