అనుకున్నట్టే జరుగుతోంది! టోక్యో నగరంలో కొవిడ్-19 కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒలింపిక్స్ క్రీడల ప్రభావం కనిపిస్తోంది! మంగళవారం ఒక్కరోజే 2,848 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 7న నమోదైన అత్యధిక కేసులు 2,520 కన్నా ఈ సంఖ్య ఎక్కువే కావడం గమనార్హం. గతేడాది మహమ్మారి మొదలైయ్యాక నగరంలోని మొత్తం కేసులు 2 లక్షలకు చేరుకున్నాయి.
ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల అతివేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియెంట్ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. యువకులు, టీకాలు తీసుకోని వారు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని వివరించారు. 50 ఏళ్లు పైబడిన వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చేరిన 3000 మందిలో వీరి వాటానే ఎక్కువ. ఈ నేపథ్యంలో నగరంలోని ఆసుపత్రుల్లో 3000గా ఉన్న పడకల సామర్థ్యాన్ని 6000కు పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.