ఎన్నాళ్లో వేచిన హృదయాలకు ఒక చల్లని కబురు ఇది.. ఎన్నేళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది.. ఇక పునర్వైభవమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తరుణమిది.. పతకాల కరవు తీరుస్తూ హాకీ ఇండియా అద్భుతం చేసింది. జర్మనీతో జరిగిన పోరులో తిరుగులేని విజయం సాధించింది. అఖండ భారతావనిని మురిపించింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది. ఈ సందర్భంగా భారత పురుషుల హాకీ జట్టుకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
"41 సంవత్సరాల విరామానికి ముగింపు పలుకుతూ ఒలింపిక్ పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. ఈ జట్టు గొప్ప నైపుణ్యం, సంకల్పాన్ని ప్రదర్శించింది. ఈ విజయం భారత హాకీలో కొత్త శకానికి నాంది పలకనుంది. క్రీడల పట్ల యువతకు ప్రేరణగా నిలుస్తుంది.".
- రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
జర్మనీతో జరిగిన పోరులో విజయం సాధించి, కాంస్య పతకాన్ని ముద్దాడిన భారత హకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. జట్టు అద్భుత నైపుణ్యాలతో విజయాన్ని సొంతం చేసుకుంది. మీ పట్ల ఈ దేశం గర్విస్తోంది.
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
"చారిత్రక విజయం.. ప్రతి భారతీయుడు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఇది. భారత్కు కాంస్య పతకాన్ని అందించిన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. ఈ ఘనతతో దేశ యువత కలల్ని నిజం చేశారు. హకీ టీమ్ పట్ల దేశమంతా గర్వంగా భావిస్తోంది".
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి