అథ్లెటిక్స్‌లో భారతీయుల స్వర్ణ పతక కలను నిజం చేసిన హరియాణా కుర్రాడు నీరజ్ చోప్డాపై దేశం నలుమూలల నుంచి రివార్డుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే సొంత రాష్ట్రం హరియాణా ప్రభుత్వం అతడికి 6 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. హరియాణా క్రీడాపాలసీ ప్రకారం.. స్వర్ణ పతక విజేతకు క్లాస్-1 ఉద్యోగం సహా 50శాతం రాయితీతో నివాస స్థలాన్ని ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు. దీంతోపాటు నీరజ్‌కు పంజాబ్ ప్రభుత్వం 2 కోట్లు, మణిపుర్ ప్రభుత్వం, బీసీసీఐ , చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కోటి రూపాయల చొప్పున నజరానా ప్రకటించాయి. చోప్డా సొంత రాష్ట్రమైన హరియాణాకు చెందిన ఎలాన్ గ్రూప్ అనే వ్యాపార సంస్థ.. 25 లక్షల రూపాయలను అతనికి ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఎక్స్‌యూవీ-700
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నీరజ్ చోప్డాను ప్రశంసల్లో ముంచెత్తారు. 'మేమంతా మీ సైన్యంలో ఉన్నాం.. మీరే మా బాహుబలి' అంటూ నీరజ్‌ను కొనియాడారు. తమ సంస్థ నుంచి కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న XUV -700 మోడల్ వాహనాన్ని అతడికి బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఏడాది పాటు ఫ్రీ
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ రొనోజోయ్ దత్తా.. నీరజ్ ఘనత పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ విమానాల్లో ప్రయాణించడానికి నీరజ్‌కు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. నీరజ్‌కు ఏడాది పాటు విమాన ప్రయాణ టిక్కెట్లను ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు.
బైజూస్ కూడా
ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ నీరజ్‌కు రూ.2కోట్ల నగదు రివార్డును ప్రకటించింది. ఈ విశ్వక్రీడల్లో దేశానికి కీర్తి తెచ్చిన ఇతర ఆరుగురు పతక విజేతలకు ఒక్కోకరికి కోటి రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపింది.
కొత్త జెర్సీ
నీరజ్‌కు ఇప్పటికే కోటి రూపాయల నజరానా ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. నీరజ్ గౌరవార్ధం కొత్త జెర్సీని రూపొందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. జావెలిన్ త్రోను విసిరిన దూరం.. 87. 58 మీటర్లలోని 8758అంకెలతో కొత్త జెర్సీని తయారుచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జెర్సీని మ్యాచ్‌లు జరిగే ప్రతి స్టేడియంకు తీసుకువెళ్తామని తెలిపింది. క్రికెటర్లు.. జెర్సీని చూసి స్ఫూర్తి పొందుతారని అభిప్రాయపడుతున్నట్లు వివరించింది.
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఇతర భారతీయ క్రీడాకారులకు కూడా దేశంలోని పలు సంస్థలు ఇలాగే బహుమతులను ప్రకటిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల క్రీడా పాలసీల ప్రకారం ప్రభుత్వాలు క్రీడాకారులకు నజరానా అందజేస్తామని తెలుపుతున్నారు. అలాగే ఒలింపిక్స్‌లో విజయం సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నగదు బహుమతిని ప్రకటించింది. ప్రాంతీయ విమాన సంస్థ స్టార్ ఎయిర్ ఆరుగురు ఒలింపిక్ పతక విజేతలు, భారత పురుషుల హాకీ జట్టు సభ్యులకు జీవిత కాలం ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించగా, గో ఎయిర్ వచ్చే అయిదేళ్ల పాటు ఈ సదుపాయం కల్పిస్తామని తెలిపింది.
ఇదీ చూడండి:
పసిడితో నీరజ్ మెరిసే.. భారత శిబిరం మురిసే!
Neeraj Chopra Match: వందేళ్ల కల సాకారం చేసి.. సంబరాల్లో మునిగి..