టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ తరపున 54 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. దేశం తరపున ఇంత మంది అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆర్చరీ, అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్ ఇలా మొత్తం 9 క్రీడలకు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టార్గెట్ ఓలింపిక్ పోడియమ్ స్కీమ్‌లో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
ఈ పారాలింపిక్స్‌లో దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు వంటి స్టార్ అథ్లెట్లతో పాటు పలువురు తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో పారా షూటర్ జ్యోతి బాలన్ ఒకరు. టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా గుజరాత్‌కు చెందిన భవీనా పటేల్, సోనాల్ బెన్ పటేల్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీల్‌ఛైర్ క్లాస్ 4, వీల్‌ఛైర్ క్లాస్ 3 కేటగిరీలతో పాటు ఉమన్స్ డబుల్స్ ఆడేందుకు సన్నధం అయ్యారు.
తైక్వాండోలో భారత్ తరపున హరియాణాకు చెందిన 21 ఏళ్ల అరుణా తన్వార్ పాల్గొననుంది. అండర్ 44 కేజీ కే44 కేటగిరీ కింద ఆమె బరిలోకి దిగనుంది. పవర్ లిఫ్టంగ్లో జైదీప్, సకీనా ఖాతున్ సత్తా చాటనున్నారు.
పతకాలు వచ్చే ఛాన్స్ ఎక్కువే..
పారాలింపిక్స్‌లో ఎఫ్-52 కేటగిరీలో బరిలోకి దిగిన డిస్కస్ త్రో అథ్లెట్ వినోద్ కుమార్.. అదే కేటగిరీలో కొనసాగనున్నాడు. దీనిపై పారా అథ్లెటిక్స్ ఛైర్పర్సన్ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్-52లో కొనసాగడం వల్ల పతకం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు.