Tokyo Olympics: క్వార్టర్స్‌లో భజరంగ్ విజయం.. సెమీస్‌కు అర్హత - టోక్యో ఒలింపిక్స్
11:28 August 06
09:43 August 06
భారత అగ్రశ్రేణి రెజ్లర్ భజరంగ్ పూనియా టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటుతున్నాడు. పతకానికి చేరువ అవుతున్నాడు. 65 కిలోల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మొర్తజాను 2-1 తేడాతో ఓడించాడు. పిన్‌డౌన్ సాయంతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. కేవలం 4:46 నిమిషాల్లోనే పోరు ముగించాడు. సెమీస్‌లో అజర్ బైజాన్‌కు చెందిన అలియెవ్ హజీతో తలపడనున్నాడు.
మొదటి పీరియడ్‌లో ఇద్దరు ఆటగాళ్లూ హోరాహోరీగా తలపడ్డారు. ఉడుం పట్టు బిగించారు. దాదాపుగా రక్షణాత్మకంగా ఆడారు. దాంతో మొర్తజా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో రౌండ్లోనూ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టే ఆడారు. భజరంగ్ కాళ్లను పట్టేసుకున్న మొర్తజా పాయింట్లు సాధించేలా కనిపించాడు. కానీ అతడి ఆటలను భజరంగ్ సాగనివ్వలేదు. ప్రతిదాడిచేసి అడ్డుకున్నాడు. టచ్‌డౌన్ చేసి రెండు పాయింట్లు సాధించాడు. సాంకేతికంగా మెరుగ్గా ఆడే భజరంగ్ సమయం దొరకగానే ప్రత్యర్థిని రింగులో పడేసి పిన్‌డౌన్ చేశాడు. సెమీస్‌కు దూసుకెళ్లాడు.