తల్లయ్యాక పరుగులో సత్తా చాటిన ఓ అమ్మ.. వివక్ష నుంచి ఒలింపిక్స్ పోడియానికి చేరిన ఓ నల్ల జాతీయురాలు.. కరోనాపై పోరాటంలో రోగులకు సేవ చేస్తూ వైరస్ బారిన పడినా.. కోలుకుని పతకం గెలిచిన ఓ నర్సు.. ఇలా ఎంతోమంది కష్టాల కడలిని దాటి టోక్యోలో విజేతలుగా నిలిచారు. పరిస్థితులు వెనక్కి లాగాలని చూసినా.. సవాళ్లతో సావాసం చేసి.. అడ్డంకులను అధిగమించి ఛాంపియన్లుగా మారారు. సమస్యలు వచ్చాయని ఆగిపోతే చరిత్ర సృష్టించాలేమని నమ్మి.. పోరాటమే మార్గంగా ముందుకు సాగి తమ దేశాలకు పతక వెలుగులు పంచిన ఈ అథ్లెట్ల ప్రయాణం స్ఫూర్తిదాయకం.
అద్భుతాలు చేసే అమ్మ..
18 ఏళ్ల ఏథెన్స్ ఒలింపిక్స్ మహిళల 200మీ. పరుగులో ఓ అమ్మాయి రజతం గెలిచింది. అందులో ఏం ప్రత్యేకత లేదనిపించొచ్చు. కానీ అదే అమ్మాయి.. అమ్మగా మారిన తర్వాత 35 ఏళ్ల వయసులో ఒలింపిక్స్ పరుగులో ఓ పసిడి, కాంస్యం నెగ్గితే.. అద్భుతమే కదా! టోక్యోలో అమెరికా అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ సాధించిందదే. వరుసగా అయిదో ఒలింపిక్స్ బరిలో దిగిన ఆమె.. 4×400మీ.రిలేలో పసిడి, 400మీ. పరుగులో కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు (11) సాధించిన మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 2018లో నెలలు నిండకముందే ఆడ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడింది. తన పాపతో పాటు నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆరోగ్యంగా ఇళ్లు చేరిన ఆమె.. తిరిగి ట్రాక్‌పై అడుగుపెట్టడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ సంకల్ప బలంతో అడుగేసిన ఆమె ఇప్పుడు రికార్డుల్లోకి ఎక్కింది.
ఏడో స్వర్ణంతో వీడ్కోలు..
నీటిలో ఆమె దిగిదంటే పసిడి ఖాయమే. డ్యూయెట్ అయినా.. టీమ్ విభాగమైనా ఆర్టిస్టిక్ స్విమ్మింగ్‌లో ఆమెకు తిరుగులేదు. మూడేళ్ల పాపకు అమ్మగా టోక్యోలో అడుగుపెట్టినప్పటికీ ఆమె జోరు తగ్గలేదు. ఈ క్రీడల్లో రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం నాలుగు ఒలింపిక్స్‌ల్లో ఏడు బంగారు పతకాలు సాధించిన ఆమె ఆటకు వీడ్కోలు పలికింది. ఆమే.. రష్యా స్విమ్మర్ స్వెత్లానా. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి పోటీపడ్డ ప్రతి విభాగంలోనూ ఆమె పసిడి నెగ్గడం విశేషం.
స్నేహం కోసం..
ఒలింపిక్స్ పతకం సాధించాలన్నది ప్రతి ఒక్క అథ్లెట్ కల. అందులోనూ పసిడి దక్కితే ఆ ఆనందమే వేరు. ఈ సారి టోక్యోలో ఒకే క్రీడాంశంలో ఇద్దరు అథ్లెట్లు ఆ సంతోషాన్ని పొందారు. అథ్లెట్ల మధ్య ఉండే పోటీని దాటి ఈ స్నేహితులు స్ఫూర్తిని పంచారు. పురుషుల హైజంప్‌లో తాంబెరి (ఇటలీ), బార్షిమ్ (ఖతార్) తమ తొలి ప్రయత్నాల్లో 2.37 మీటర్ల దూరం దూకారు. ఆ తర్వాత ఇద్దరిలో ఏ ఒక్కరూ అంతకుమించిన ప్రదర్శన చేయలేకపోయారు. విజేతను తేల్చేందుకు జంపాఫ్ నిర్వహించాలని నిర్వహకులు అనుకున్నారు. కానీ తాము పసిడి పంచుకుంటామని, ఇద్దరికీ స్వర్ణాలు ఇవ్వాలని బార్షిమ్ అడగడం వల్ల నిర్వాహకులు అందుకు ఒప్పుకొన్నారు. నిబంధనల ప్రకారం జంపాఫ్‌కు అథ్లెట్లు ఒప్పుకోకపోతే ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించవచ్చు. దీంతో సంతోషం పట్టలేని తంబేరి.. పరుగెత్తుతూ వచ్చి ఒక్కసారిగా ఎగిరి బర్శిమ్ కౌగిలిలో ఒదిగిపోయాడు. 11 ఏళ్ల నుంచి మంచి మిత్రులైన వీళ్లిద్దరూ పసిడి పంచుకోవడం ఒలింపిక్స్‌కే హైలైట్‌గా నిలిచింది.
నాన్న కోసం..
పాఠశాల స్థాయి రెజ్లింగ్ మ్యాచ్‌లో తన కూతురు పోటీపడుతుంటే చూడాలని ఆ తండ్రి వెళ్లాడు. మ్యాచ్ అయిపోయాక తిరిగి కార్లో ఇంటికి వెళ్తున్నాడు. కానీ అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తన రెజ్లింగ్ కారణంగానే తండ్రి మరణించాడని భావించిన ఆ అమ్మాయి.. కొన్నేళ్ల పాటు ఆటకు దూరంగా ఉంది. కానీ రెజ్లింగ్‌లో ఛాంపియన్‌గా నిలవాలనే ఆయన కలను నిజం చేసేందుకు తిరిగి మ్యాట్‌పై అడుగుపెట్టింది. ఇప్పుడు ఒలింపిక్స్ పసిడి పతకాన్ని అందుకుంది. ఆమే.. అమెరికా రెజ్లర్ మెన్సా స్టాక్. టోక్యోలో మహిళల 68 కేజీల స్వర్ణం గెలిచి ఆ ఘనత అందుకున్న తొలి అమెరికా నల్లజాతీయురాలిగా నిలిచింది. జాత్యహంకారం ఎక్కువగా ఉండే అమెరికా లాంటి దేశం నుంచి వచ్చి.. తన తండ్రి మరణాన్ని దిగమింగి.. ఇప్పుడు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె ప్రయాణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
మానసిక సమస్యను దాటి..