ఒలింపిక్స్‌లో పతక విజేతగా నిలవాలనే తపనతో ఈ తరం అథ్లెట్లు డయిట్ పేరుతో తిండిలో పరిమితి పెట్టుకుంటున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ సింధు దగ్గర్నుంచి ఇటీవలే ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి వరకు.. చాలా మంది తమకు ఇష్టమైన ఆహారాన్ని వదిలేసి.. ఫిట్నెస్ నిత్యం కోసం తపనపడుతున్నారు.
ఇష్టమైన తిండికి దూరంగా..
పెరుగు అంటే తనకు ఎంతో ఇష్టమని స్టార్ షట్లర్ సింధు అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. కానీ, పెరుగు తింటే ఫిట్నెస్ను కాపాడుకోవడం కష్టమని.. అందుకే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు దానికి దూరంగా ఉంటానని చెప్పింది.
అదే విధంగా టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన మణిపూర్ గర్ల్.. మీరాబాయి చానుకు పిజ్జా అంటే అమితమైన ప్రేమ. ఫిట్నెస్ కోసమే తనకు ఇష్టమైన ఫుడ్‌ను దూరం పెట్టింది. ఇప్పుడు పతక విజేతగా నిలిచిన తర్వాత పిజ్జా తినేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో తనకు ఇష్టమైన పిజ్జాలను మీరాబాయికి జీవితాంతం ఉచితంగా అందిస్తామని ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డొమినొస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఇలా తమకున్న చిన్న చిన్న కోరికలను చంపుకుని.. కలల వైపు ఎంతోమంది క్రీడాకారులు సాగిపోతున్నారు. ఓ సగటు క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే దాదాపు 5 ఏళ్ల పాటు ఫిట్నెస్ కొనసాగిస్తూ.. ఆటపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తినే ప్రతి దాంట్లో తప్పక నిబంధన పెట్టుకోవాల్సి ఉంటుంది.