ఒలింపిక్స్ పతకం కోసం ఏళ్ల కష్టాన్ని పెట్టుబడిగా పెడతారు క్రీడాకారులు. ఆ ఎదురుచూపులకు ఆశించిన ఫలితం దక్కకపోతే.. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు. అర్జెంటీనాకు చెందిన మారియా బెలెన్ పెరెజ్ మారైస్ అనే ఫెన్సింగ్ క్రీడాకారిణికి సోమవారం టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ఆశలు చెదిరిపోయాయి. కానీ ఆమె కోచ్ మాత్రం ఈ రోజును ఆమెకు ప్రత్యేకంగా మార్చారు. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగి తోడుగా నిలిచారు.
మారియా, ఆమె కోచ్ లుకాస్ గిల్లెర్మో సాసిడో ఎన్నోఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. సాసిడో ఆమెను పెళ్లిచేసుకోవాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నారు. 2010లో కూడా ఒకసారి మారియా ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచగా.. ఆమె తిరస్కరించారని ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఇన్నేళ్లకు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ వేదికగా ఆయన మరోసారి తన మనసులో మాటను బయటపెట్టారు. ఈసారి మాత్రం ఆయనకు 'ఎస్' అనే సమాధానం వినిపించింది. దాంతో ఆ కోచ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.