తెలంగాణ

telangana

ETV Bharat / sports

అలెగ్జాండర్​ X థీమ్: తొలిసారి టైటిల్​ నెగ్గేదెవరు?

తొలి రెండు సెట్లు పోయాయి.. ప్రత్యర్థి జోరు మీదున్నాడు.. ఇలాంటి క్లిష్ట స్థితిలోనూ గొప్పగా పుంజుకుని పాబ్లో కరెనో (స్పెయిన్‌)ను ఓడించిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం టైటిల్‌ పోరులో అతను డొమినిక్‌ థీమ్‌ (కెనడా)తో తలపడనున్నాడు. హోరాహోరీగా సాగిన మరో సెమీస్‌లో మెద్వెదెవ్‌ (రష్యా)పై థీమ్‌ విజయం సాధించాడు.

Zverev erases 2-set hole, will face Thiem in US Open final
యుఎస్​ ఓపెన్​ ట్రోఫీని నెగ్గేదెవరు?

By

Published : Sep 13, 2020, 8:05 AM IST

అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ సత్తా చాటాడు.. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకునే దిశగా అతను కీలక అడుగు వేశాడు. మేజర్‌ టోర్నీల్లో ఎప్పుడూ సెమీస్‌ దాటని ఈ జర్మనీ కుర్రాడు తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో అయిదో సీడ్‌ జ్వెరెవ్‌ 3-6, 2-6, 6-3, 6-4, 6-3తో 20వ సీడ్‌ పాబ్లో కరెనో (స్పెయిన్‌)పై చెమటోడ్చి గెలిచాడు. 3 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ సమరంలో మొదట్లో రెండు సెట్లు కోల్పోయినా అలెగ్జాండర్‌ అసాధారణంగా పుంజుకుని విజయం సాధించాడు.

ఆరంభంలో తడబాటు

పదే పదే బంతిని నెట్‌కు లేదా కోర్టు బయటకు కొట్టేయడం.. సులభమైన అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేకపోవడం.. ఇది తొలి రెండు సెట్లలో జ్వెరెవ్‌ ఆట...! డ్రాప్‌ షాట్లు.. బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లు, కచ్చితమైన సర్వీసులు ఇదీ పాబ్లో దూకుడు.. ఫలితం తొలి రెండు సెట్లూ అలెగ్జాండర్‌ చేజారాయి. మొదటి సెట్‌ నాలుగో గేమ్‌లోనే సర్వీస్‌ కోల్పోయిన ఈ జర్మనీ స్టార్‌.. ఆ తర్వాత 3-6తో సెట్‌ కూడా చేజార్చుకున్నాడు. రెండో సెట్లోనూ జ్వెరెవ్‌ ఆట మెరుగుపడలేదు. దూకుడు కొనసాగించిన పాబ్లో 6-2తో సెట్‌ గెలిచి జ్వెరెవ్‌కు షాకిచ్చేలా కనిపించాడు. తొలి రెండు సెట్లలోనే అలెగ్జాండర్‌ అయిదుసార్లు సర్వీస్‌ కోల్పోయాడు.

గొప్పగా పుంజుకుని..

మూడో సెట్‌ నుంచి జ్వెరెవ్‌ ఆట పూర్తిగా మారిపోయింది. బలమైన సర్వీసులు, రిటర్న్‌లతో సత్తా చాటిన అలెగ్జాండర్‌ ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరులో 6-3తో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నాలుగో సెట్‌ మూడో గేమ్‌లో పాబ్లో సర్వీస్‌ బ్రేక్‌ చేసిన అతను 2-1తో ఆధిక్యంలో నిలిచినా వెంటనే సర్వీస్‌ చేజార్చుకున్నాడు. కానీ ఏడో గేమ్‌లో మరోసారి ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన అతను అదే జోరుతో 6-4తో సెట్‌ గెలిచాడు. ఫలితాన్ని తేల్చే ఆఖరి సెట్లో తొలి, ఏడో గేమ్‌లలో బ్రేక్‌లు సాధించిన జ్వెరెవ్‌.. 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలిచాడు. ఈ పోరులో అతను 24 ఏస్‌లతో పాటు 71 విన్నర్లు కొట్టాడు.

మెద్వెదెవ్‌పై థీమ్‌ పైచేయి

మరో సెమీస్‌లో డానియల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై డొమినిక్‌ థీమ్‌ (కెనడా) పైచేయి సాధించాడు. రెండో సీడ్‌ థీమ్‌ 6-2, 7-6 (9/7), 7-6 (7/5)తో మూడో సీడ్‌ మెద్వెదెవ్‌పై వరుస సెట్లలో నెగ్గాడు. తొలి సెట్‌ సులువుగా థీమ్‌ సొంతం కాగా.. రెండు, మూడు సెట్లలో మెద్వెదెవ్‌ పోరాడాడు. ఈ రెండు సెట్లలోనూ అతనికి గెలిచేందుకు అవకాశం వచ్చింది కానీ తడబడి చేజార్చుకున్నాడు.

23 ఏళ్ల జ్వెరెవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. యూఎస్‌ ఓపెన్‌ తుది సమరానికి అర్హత సాధించడం థీమ్‌కు మొదటిసారి. మొత్తం మీద ఇద్దరిలో ఎవరు గెలిచినా వారికిదే తొలి టైటిల్‌. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఇప్పటిదాకా థీమ్‌ మూడుసార్లు ఫైనల్‌కు వచ్చినా టైటిల్‌ అందుకోలేకపోయాడు.

పురుషుల ఫైనల్‌ నేడే-కొత్త ఛాంపియన్‌ ఎవరు?

గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో ఆరేళ్లుగా కొత్త ఛాంపియన్‌ లేడు. 2014లో సిలిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ నెగ్గాక.. కొత్తగా ఎవరూ టైటిల్‌ గెలవలేదు. ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌, ముర్రే లేదా వావ్రింకా .. వీరివే టైటిళ్లు. ఆదివారం యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌తో కొత్త ఛాంపియన్‌ రానున్నాడు. ఇప్పటికే ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2018, 19), ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2020) ఫైనల్స్‌లో ఆడిన అనుభవం ఉన్న థీమ్‌ టైటిల్‌ గెలుస్తాడా.. తొలిసారి ఫైనల్‌ చేరిన జ్వెరెవ్‌ విజేతగా నిలుస్తాడా.. అన్నదే చూడాలి. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1.30కు ఫైనల్‌ ఆరంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details