తెలంగాణ

telangana

ETV Bharat / sports

French Open: అదరగొట్టిన జిదాన్‌సెక్‌ - Alexander Zverev

ఆమె ర్యాంకు 85.. రెండు వారాల ముందు వరకు తన పేరు కూడా టెన్నిస్‌ అభిమానులకు పెద్దగా తెలియదు. కానీ ఫ్రెంచ్‌ ఓపెన్‌(French Open-2021)లో అద్భుత ప్రదర్శనతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది జిదాన్‌సెక్‌(Tamara Zidanšek). రొలాండ్‌ గారోస్‌లో 23 ఏళ్ల ఈ స్లొవేకియా అమ్మాయి సెమీఫైనల్‌కు దూసుకెళ్లి సంచలనం రేపింది. మరోవైపు రష్యా తార పవ్లిచెంకోవా(Pavlyuchenkova) కూడా తొలిసారి గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్స్‌ దాటడం విశేషం. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌ స్వైటెక్‌(Swiatek) క్వార్టర్స్‌ చేరింది.

Zidansek and Pavlyuchenkova reach French Open semis after epic battles
French Open: అదరగొట్టిన జిదాన్‌సెక్‌

By

Published : Jun 9, 2021, 6:43 AM IST

Updated : Jun 9, 2021, 6:52 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్లో(French Open-2021) టమారా జిదాన్‌సెక్‌(Tamara Zidanšek) దూసుకెళ్తోంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఈ స్లోవేనియా అమ్మాయి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్‌ జిదాన్‌సెక్‌ 7-5, 4-6, 8-6తో పౌలా బదోసా (స్పెయిన్‌)ను ఓడించింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలిసారి క్వార్టర్స్‌ దశకు వచ్చిన జిదాన్‌సెక్‌, బదోసా క్వార్టర్స్‌లో నువ్వానేనా అన్నట్లు పోరాడారు. అయితే తొలి సెట్లో మాత్రం బదోసాదే ఆధిపత్యం. ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 3-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ స్పెయిన్‌ అమ్మాయి. కానీ పుంజుకున్న టమారా 3-3తో స్కోరు సమం చేయడమే కాక.. పదకొండో గేమ్‌లో బదోసా(Badosa) సర్వీస్‌ బ్రేక్‌ చేసి సెట్‌ గెలుచుకుంది.

రెండో సెట్లోనూ జిదాన్‌సెక్‌దే జోరు. ఒక దశలో ఆమె 4-2తో సెట్‌ గెలిచేందుకు చేరువైంది. కానీ అనూహ్యంగా పుంజుకున్న బదోసా వరుసగా నాలుగు గేమ్‌లు కైవసం చేసుకుని సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక చివరి సెట్లో ఇద్దరూ మరోసారి హోరాహోరీగా తలపడ్డారు. పాయింట్‌ పాయింట్‌ కోసం పోరాటం జరిగింది. కానీ స్కోరు 6-6తో సమంగా ఉన్న సమయంలో వరుసగా రెండు పాయింట్లు దక్కించుకున్న జిదాన్‌సెక్‌తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. ఒక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.

పవ్లిచెంకోవా పోరాటం..

రష్యా స్టార్‌ అనస్తేసియా పవ్లిచెంకోవా(pavlyuchenkova) తుది నాలుగు జాబితాలో చోటు దక్కించుకుంది. నువ్వానేనా అన్నట్లు సాగిన క్వార్టర్స్‌ సమరంలో పవ్లిచెంకోవా 7-6 (2/7), 6-2, 9-7తో ఎలీనా రిబకీనా (ఉక్రెయన్‌)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ కోల్పోయి ఒత్తిడిలో పడిన పవ్లించెన్‌కోవా.. గొప్పగా పుంజుకుని ముందంజ వేసింది. తొలి సెట్‌లో మెరుగ్గానే ఆడినా టైబ్రేకర్‌లో ఓడిన పవ్లిచెంకోవా.. రెండో సెట్‌ నుంచి దూకుడుగా ఆడింది. మెరుపు విన్నర్లతో పాటు డ్రాప్‌ షాట్లతో పాయింట్లు సాధించి రెండో సెట్‌ను చేజిక్కించుకుని మ్యాచ్‌లో నిలిచింది.

మూడో సెట్లో ఇద్దరూ తగ్గకపోవడం వల్ల మ్యాచ్‌ రంజుగా సాగింది. ఈ క్రమంలో రిబకీనా మూడుసార్లు సర్వీస్‌ బ్రేక్‌ కాకుండా కాపాడుకుంది. స్కోరు 7-7తో సమంగా ఉన్న స్థితిలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన పవ్లిచెంకోవా సెట్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. రిబకీనా.. పవ్లిచెంకోవాకు డబుల్స్‌ భాగస్వామి కావడం విశేషం. ఫ్రెంచ్‌ ఓపెన్లో ఈ జోడీ ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌ చేరింది.

స్వైటెక్‌ ముందంజ

టైటిల్‌ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటెక్‌(Swiatek) (పోలెండ్‌) మరో అడుగు వేసింది. ప్రత్యర్థి నుంచి ప్రతిఘటనను అధిగమిస్తూ ఆమె క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ ఎనిమిదో సీడ్‌ 6-3, 6-4తో మార్టా కోస్తుక్‌ (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మార్టా నుంచి స్వైటెక్‌కు గట్టి పోటీనే ఎదురైంది. ఆరంభంలో స్వైటెక్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి మార్టా జోరు మీద కనిపించింది. కానీ ఒత్తిడిని తట్టుకుంటూ స్వైటెక్‌ తన శైలి ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో ఎదురుదాడికి దిగింది. ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేయడమే కాక.. అదే జోరుతో సెట్‌ దక్కించుకుంది.

రెండో సెట్లోనూ మార్టా పోరాడింది. కానీ ఆమె అనవసర తప్పిదాలు చేయడం స్వైటెక్‌కు కలిసొచ్చింది. ఒక దశలో కోస్తుక్‌ రాకెట్‌ను నేలకేసి కొట్టి అసహనాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు తన జోరు మరింత పెంచిన ఇగా.. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 6-4తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ పోరులో 24 విన్నర్లు కొట్టిన స్వైటెక్‌ నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. పురుషుల సింగిల్స్‌లో జర్మనీ యువ ఆటగాడు ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(Alexander Zverev) (జర్మనీ) అలవోకగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ఫైనల్లో అతడు 6-4, 6-1, 6-1తో డవిడోవిచ్‌ ఫోకినా(Davidovich Fokina) (స్పెయిన్‌) మట్టికరిపించాడు.

ఇదీ చూడండి..French Open: క్వార్టర్స్​కు జకోవిచ్​, నాదల్​

Last Updated : Jun 9, 2021, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details