ఎనిమిదిసార్లు ఛాంపియన్ రోజర్ ఫెదరర్(Roger Federer) వింబుల్డన్(Wimbledon) ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. యువ కెరటం జ్వెరెవ్(Alexander Zverev) కూడా నాలుగో రౌండ్లో ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో క్రెజికోవా, గాఫ్ ముందంజ వేశారు.
ఆరో సీడ్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) వింబుల్డన్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మూడో రౌండ్లో అతడు 6-4, 6-4, 5-7, 6-4తో నూరీ (బ్రిటన్)పై కష్టపడి గెలిచాడు. గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్న ఫెదరర్.. మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు 48 విన్నర్లు కొట్టాడు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఏడో సీడ్ బెరెటినీ (ఇటలీ) కూడా నాలుగో రౌండ్లో ప్రవేశించారు. మూడో రౌండ్లో జ్వెరెవ్ చెమటోడ్చాడు. అతడు 6-7 (3-7), 6-4, 6-3, 7-6 (7-4)తో ఫ్రిట్జ్ (అమెరికా)ను ఓడించాడు. జ్వెరెవ్ 19 ఏస్‌లు, 45 విన్నర్లు కొట్టాడు. మరో మ్యాచ్‌లో బెరెటిని 6-4, 6-4, 6-4తో బెడెన్ (స్లొవేనియా)పై నెగ్గాడు. అగర్ అలియాసిమె (కెనడా)తో మ్యాచ్‌లో 6-2, 1-6తో ఉన్న దశలో కిర్గియోస్ (ఆస్ట్రేలియా) గాయంతో రిటైరయ్యాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో హర్కజ్ (పోలెండ్) 6-3, 6-4, 6-2తో బబ్లిక్ (కజకిస్థాన్)పై, ఇవాష్క (బెలారస్) 6-4, 6-4, 6-4తో థాంప్సన్ (ఆస్ట్రేలియా)పై నెగ్గారు.