అత్యధిక సింగిల్స్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్(20)ను సమం చేయడానికి సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)కు సువర్ణావకాశం! అతడు ఒక్క అడుగేస్తే వాళ్ల సరసన నిలుస్తాడు. అందుకు ఆదివారం మాటో బెరిటిని (ఇటలీ)తో జరిగే వింబుల్డన్(Wimbledon) ఫైనల్లో గెలవాల్సి ఉంది. అంతేకాదు తుది పోరులో నెగ్గితే అతడికిది వరుసగా మూడో వింబుల్డన్ టైటిల్, మొత్తం మీద ఆరో ట్రోఫీ కానుంది.
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి భీకర ఫామ్ లో ఉన్న నొవాక్.. ఇదే జోరు తుది సమరంలో ప్రదర్శిస్తే అతడికి తిరుగే ఉండదు. ఈ ఏడాది 36 మ్యాచ్‌లు ఆడిన అతడు 32 విజయాలు సాధించాడంటేనే జకో జోరును అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 30వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతున్న జకోను ఆపడం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరిటినికి కష్టమే. తానాడిన గత 16 గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఈ సెర్బియా స్టార్ కేవలం మూడింట్లో మాత్రమే ఓడిపోయాడు.