చైనా టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ డబుల్స్ నంబర్‌వన్ పెంగ్ షువాయి ఆచూకీ(Chinese tennis player missing) తెలియడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ఉద్ధృతమైంది. దీంతో ఆమె క్షేమంగానే ఉన్నారనే ఫొటోలు(Peng shuai photos), వీడియోలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు నిజంగా ఏదైనా జరిగిందా..? లేక కావాలనే బయటి ప్రపంచానికి దూరంగా ఉందా? అర్థం కావడం లేదు.
అసలేంటీ వివాదం..?
చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్ గవోలి.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఈనెల 2న పెంగ్(Peng shuai allegation) సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలుచేసింది. జాంగ్ తనతో శృంగారం చేయాలని బలవంతం చేశాడని, ఏడేళ్ల క్రితం అతనితో ఓ సారి శృంగారంలో పాల్గొన్నానని అందులో పేర్కొంది. కానీ తర్వాత ఆ పోస్టును తొలగించడం గమనార్హం. దీంతో అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే షువాయికి ఏమైందోనని అభిమానులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "పెంగ్ ఎక్కడ?"(Where is peng shuai) అంటూ సాధారణ ప్రజల దగ్గర నుంచి ప్రముఖుల వరకూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై పురుషుల, మహిళల టెన్నిస్ అసోసియేషన్ సభ్యులు సైతం ఆమెకు ఏమైందో తెలియజేయాలంటూ చైనా అధికారులను కోరారు.
ఎవరెవరు స్పందించారంటే..
పెంగ్ ఆచూకీ తెలియకపోవడంపై ఇటీవల జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాక(Osaka tweet about peng shuai), సెర్బియన్ దిగ్గజం నోవాక్ జకోవిచ్, అమెరికా స్టార్ సెరీనా విలియమ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఎక్కడుందని నిలదీశారు. "మీకు ఈ వార్త గురించి తెలుసో లేదో కానీ ఓ సహచర టెన్నిస్ క్రీడాకారిణి కనిపించడం లేదని నాకు సమాచారం అందింది. లైంగిక దాడికి గురయ్యానని ఆమె చెప్పిన తర్వాతే ఆచూకీ దొరకడం లేదు. మహిళల్ని అణచివేయడమనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సరైంది కాదు. ఈ పరిస్థితి షాక్‌కు గురిచేసింది" అని ఒసాక పోస్టు చేసింది.
అలాగే పెంగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్ కూడా డిమాండ్ చేశాడు. సెరెనా సైతం స్పందించింది. "పెంగ్ కనిపించడం లేదనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె క్షేమంగానే ఉందని.. త్వరలోనే బయటకు వస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంపై విచారణ జరపాలి. దీనిపై నిశ్శబ్దంగా ఉండలేం" అంటూ ట్వీట్ చేసింది.
డబ్ల్యూటీఏ ఛైర్మన్ అనుమానం..
మరోవైపు పెంగ్ సురక్షితంగానే ఉన్నానని, తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఇటీవల డబ్ల్యూటీఏ ఛైర్మన్ స్టీవ్ సిమన్‌కు ఆమె ఈ మెయిల్ చేసినట్లు చైనా మీడియా సంస్థ ఒకటి ఇటీవల ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే, దీనిపై స్పందించిన సిమన్.. ఆమె నుంచి వచ్చిన ఈ మెయిల్‌పై తనకు సందేహాలున్నాయని స్పష్టం చేశారు. పెంగ్ ఆచూకీ దొరకకపోతే చైనాతో తమ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు కూడా వెనకాడబోమని గట్టిగా హెచ్చరించాడు. ఇదిలా ఉండగా, పెంగ్ క్షేమంగానే ఉన్నట్లు డబ్ల్యూటీఏ నుంచి సమాచారం అందిందని ఏటీపీ ఛైర్మన్ గాడెంజి పేర్కొనడం గమనార్హం.