ఇప్పటికే ఒలింపిక్స్ నుంచి తప్పుకొన్న స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. ఇప్పుడు వింబుల్డన్ నుంచి నిష్క్రమించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఆమె.. టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఆడిన సెరెనా.. ప్రీక్వార్టర్స్‌లో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది.
మోడ్రన్ టెన్నిస్‌లో ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న క్రీడాకారిణి సెరెనా విలియమ్స్. ఇప్పటి వరకు 23 సొంతం చేసుకుంది. అయితే ఆల్‌టైం గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు మార్గరెట్ కోర్ట్(24) పేరుతో ఉంది. ఎలాగైనా సరే ఆమె రికార్డును సమం చేయాలని రెండేళ్ల నుంచి సెరెనా శ్రమిస్తోంది. కానీ పరిస్థితులు అచ్చిరాకపోవడం, గాయాల బెడదతో కుదరడం లేదు.
తనకు అచ్చొచ్చిన వింబుల్డన్‌పై సెరెనా విలియమ్స్ ఎన్నో ఆశలు పెట్టుకొంది. అనూహ్యంగా గాయం కారణంగా నిష్ర్కమించక తప్పలేదు. మంగళవారం ఆమె సెంటర్ కోర్టులో అలియక్‌సాండ్ర ససనోవిచ్‌తో తలపడింది. ఐదో గేమ్‌లో సర్వీస్ చేస్తుండగా బేస్‌లైన్ వద్ద ఆమె కాలు బెణికింది. పాయింట్ల మధ్య నొప్పితో విలవిల్లాడింది. ఆ గేమ్ పూర్తవగానే మెడికల్ టైమ్ ఔట్ తీసుకుని ఆట కొనసాగించింది.