ప్రపంచ టెన్నిస్‌లో నొవాక్ జకోవిచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడిగా ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకూ అతను ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో 311 వారాలు గడిపాడు. గత వారమే ఫెదరర్ (310 వారాలు) రికార్డును సమం చేసిన అతను.. తాజాగా చరిత్ర తిరగరాశాడు. "ఇదో గొప్ప రోజు" అని సోమవారం జకో ట్వీట్ చేశాడు.
"టెన్నిస్‌లో దిగ్గజాలు నడిచిన దారిలో నేనూ వెళ్తుండడం ఉత్తేజాన్ని కలిగిస్తోంది. నా చిన్ననాటి కలను సాకారం చేసుకుంటూ వాళ్ల సరసన నా పేరు చేరడం ఆనందంగా ఉంది. ప్రేమ, అభిరుచితో కష్టపడితే ఏదైనా సాధ్యమే అని చాటేందుకు ఇదే గొప్ప ఉదాహరణ" అని ఏటీపీ విడుదల చేసిన ప్రకటనలో నొవాక్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జకో కెరీర్‌లోని అత్యుత్తమ సందర్భాలను బెల్‌గ్రేడ్‌లోని టౌన్‌హాల్‌లో ప్రదర్శించారు. ప్రస్తుతం 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఫెదరర్, నాదల్ (చెరో 20) తర్వాతి స్థానంలో ఉన్న 33 ఏళ్ల జకో వాళ్లను చేరుకునే దిశగా సాగుతున్నాడు.